నంబర్ 4. టీమిండియా చాలాకాలంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్న సమస్య. మ్యాచ్ పరిస్థితులకు తగినట్టు నాలుగో స్థానంలో నిలకడగా ఆడే ఆటగాడి కోసం టీమిండియా నాలుగేళ్లుగా ఎదురుచూస్తోంది. అనేక ప్రయోగాలు చేసింది. శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, కేఎల్ రాహుల్ ఇలా 11 మందిని ఆ స్థానంలో పరీక్షించింది. రెండేళ్లుగా అంబటి రాయుడు ఆ స్థానానికి న్యాయం చేశాడు. ఒక్క సిరీస్‌లోనే తడబడ్డాడు. ప్రపంచకప్‌లో అనూహ్యంగా అతడిని కాదని విజయ్ శంకర్‌కు చోటిచ్చారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగరే ఈ ప్రయోగాలకు పర్యవేక్షకుడు! ఓపెనర్లు అదరగొట్టినప్పుడు తెలియలేదు గానీ వారు విఫలమైనప్పుడే అసలు సమస్య బయటపడింది. బంగర్ పదవికి ప్రమాద ఘంటికలు మోగాయి. ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైన తర్వాత బ్యాటింగ్ కోచ్‌గా బంగర్ ఇన్నాళ్లూ ఏం చేశారన్నదానిపై అందరి దృష్టి మళ్లింది. వికెట్లు పడి జట్టు కష్టాల్లో విలవిల్లాడుతున్నప్పుడు అనుభవజ్ఞుడైన ఎంఎస్ ధోనీని ముందు పంపకుండా ఏడో స్థానంలో ఆడించడానికి ఆయనే కారణమని తెలిసింది. అది జట్టు సమష్టి నిర్ణయమని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. ప్రపంచకప్‌తో రవిశాస్త్రి, బంగర్, భరత్ అరుణ్, శ్రీధర్ పదవీకాలం ముగిసింది. ఈ లోగా కరీబియన్ పర్యటన ఆరంభం కావడంతో వారికి 45 రోజులు గడువు పొడగించారు. కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ మళ్లీ శాస్త్రికే పట్టం కట్టింది. సహాయ సిబ్బంది ఎంపిక మాత్రం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ చేపట్టింది. మిగిలిన ముగ్గురికీ బీసీసీఐ కాంట్రాక్టు దక్కినా అనుకున్నట్టుగానే బంగర్‌పై వేటు పడింది. విక్రమ్ రాఠోడ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా కమిటీ ఎంపిక చేసింది. ఆ తర్వాతే మొదలైందీ కథ!
కోహ్లీసేన వెస్టిండీస్ పర్యటన బుధవారంతో విజయవంతంగా ముగిసింది. వెంటనే బంగర్ వివాదం బయటకు వచ్చింది. రెండు వారాల క్రితం ఈ ఘటన జరిగిందట. ఓ హోటల్‌లో బస చేస్తున్న సెలక్షన్ కమిటీ సభ్యుడు దేవాంగ్ గాంధీ గదికి బంగర్ ఆవేశంగా వెళ్లాడు. తలుపు తన్నాడు. గదిలోకి ప్రవేశించి ఆయనతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. జట్టు తనకు అండగా ఉందని సెలక్షన్ కమిటీని బెదిరించాడు. తనను తొలగించాలన్న నిర్ణయాన్ని వారు ఒప్పుకోరని హెచ్చరించాడు. ఒకవేళ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేయకుంటే జాతీయ క్రికెట్ అకాడమీలో ఏదో ఒక పదవి ఇప్పించాలని అన్నాడు. ఈ విషయం ఇప్పుడు బయటపడింది. క్రికెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్ రాయ్ దృష్టికి చేరింది. నిజానిజాలు ఏమిటో తెలుసుకొనేందుకు ఇప్పటికే బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగర్ 2014లో టీమిండియా బృందంలో చేరాడు. అతడితో వ్యవహరించడం చాలా కష్టమేనని ఇప్పుడు తెలుస్తోంది. అతడితో వ్యవహరించేటప్పుడు అంతర్గతంగా జట్టులో ఎవరికీ నమ్మకం ఉండేది కాదట. అనుమానాస్పదుడిగా కనిపించేవాడట. దేవాంగ్ గాంధీని సంజయ్ అవమానించడంపై జట్టు మేనేజర్ సుబ్రమణ్యం లేదా రవిశాస్త్రి నుంచి అధికారిక నివేదిక కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. జరిగిన సంఘటన నిజమేనని ధ్రువీకరిస్తే వ్యవహారం సీఓఏ దృష్టికి వెళ్తుంది. అప్పుడు ఎలాంటి శిక్ష వేస్తారన్నది ఆసక్తికరం. వేటు పడితే సహజంగా ఎవరికైనా బాధేస్తుందని ఐతే గాంధీని ప్రశ్నించే అధికారం మాత్రం బంగర్‌కు లేదని అధికారులు అంటున్నారు. మిగిలిన సిబ్బంది ప్రదర్శన బాగుంది. అందుకే ఎంపిక చేశారు. లోపాలున్నప్పుడు బంగర్‌ను ఎందుకు ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు.