Politics

దొరగారూ…ఆ పోస్టులు భర్తీ చేయండి!

https://i.ytimg.com/vi/7DV5TpzQ9Fo/sddefault.jpg

ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఈఆర్సీ) ఛైర్మన్‌, సభ్యులను నియమించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో అయిదున్నరేళ్ల తెరాస పాలనలో కీలకమైన స్వతంత్ర సంస్థలన్నీ స్వతంత్రను కోల్పోయాయని ఆరోపించారు. ఎనిమిది నెలలుగా ఈఆర్సీ ఛైర్మన్‌, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా.. ఇప్పటి వరకు భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఈఆర్సీ ఛైర్మన్‌, సభ్యులను భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయని రేవంత్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా లోపించిందని, ఏ క్షణంలోనైనా కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్‌ కొనుగోళ్లు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలకు తన వద్ద సమగ్రమైన ఆధారాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు ఈఆర్సీకి నివేదికలు అందచేసే పనిని సక్రమంగా చేసిన దాఖలాల్లేవని పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్‌ సంస్థల ఛార్జీల ప్రతిపాదనలను నవంబర్‌ 2 లోపు ఈఆర్సీకి పంపాల్సి ఉందని, ఆలోపు నియామకం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈఆర్సీ అనుమతి లేకుండా విద్యుత్‌ రంగంలో తీసుకునే ఏ నిర్ణయమైనా పూర్తిగా చట్ట విరుద్దమేనని రేవంత్‌ తన లేఖలో ప్రస్తావించారు.