Editorials

మోడీ-అమిత్ షాల తదుపరి లక్ష్యం చంద్రబాబేనట-TNI ప్రత్యేకం

Modi Amith Shahs Next Target Is Chandrababu-TNILIVE Editorial Specials

ఇప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలించిన ప్రధాన మంత్రులలో ఉక్కు మహిళగా, దానికి మించిన నియంతగా స్వర్గీయ ఇందిరాగాంధీ పేరుగడించారు. 1977కు ముందు దేశంలో ఎమర్జెన్సి విధించి ప్రతిపక్ష నేతల అందరిని జైల్లో కుక్కారు. తనకు ఎదురే లేదన్నట్లుగా ఆనాడు ఇందిరాగాంధీ వ్యవహరించారు. అదే పంథాను ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అనుచరిస్తున్నారని ప్రతిపక్షాల వారు గట్టిగా ఆరోపిస్తున్నారు. మోడీకి నిప్పుకు ‘నింగి తోడైనట్లు’ అమిత్ షా జతకలిశారు,. వీరిరువురి సారధ్యంలో ప్రతి నిత్యం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, దానికి మిత్రపక్షాలుగా ఉన్న నేతలను వివిధ కేసుల్లో ఇరికించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రధాని తరువాత సర్వం తానె అన్నట్లుగా దేశాన్ని నడిపించిన మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరాన్ని నేడు సామాన్య ఖైదీగా తీహార్ జైల్లోకి తరలించారు. నిన్న కర్ణాటకలో కాంగ్రెస్లో కీలక వ్యక్తిగా ఉన్న డీకే శివకుమార్ ను అరెస్టు చేశారు. కాంగ్రెస్ నేతలను వివిధ కేసుల్లో ఇరికించే ప్రయత్నాల్లో మోడీ అమిత్ షాలు నిమగ్నమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. మిగిలిన కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, శశిధరూర్ పై కూడా కేసుల కత్తి వేలాడుతోంది. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా పైనా భూమి కుంభకోణం కేసు నడుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు తల్లికొడుకులు సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ పై ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు మిత్రులుగా ఉన్న కర్ణాటక మాజీ సిఎం కుమారా స్వామీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ తదితరుల పైన వివిధ నేరాలు మోపి, ఎఫ్.ఐ.ఆర్ లను సిద్దం చేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చాలా కాలం నుండి జైల్లోనే మగ్గుతున్నారు.
*** తదుపరి వంతు చంద్రబాబుదే
ప్రసుతం మోడీ అమిత్ షాల చూపు చంద్రబాబు పైన పడినట్లు సమాచారం. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలకు దిగారు. ప్రతి నిత్యం మోడీని తిడుతూ ప్రధాన పత్రికల పతాక శీర్షికలలో నిలిచారు. ఎన్నికల సమయంలోనే అప్పటి తెదేపా ఎంపీలు సిఎం రమేష్, సుజనా చౌదరిల పై కేంద్ర ప్రభుత్వం భారీగా దాడులను జరిపించింది. ఎన్నికల అనంతరం వారిరువురు మోడీ కాళ్ళ ముందు మోకరిల్లి తమ మీద కేసులు లేకుండా భాజపా భజన చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారిగా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కుంభకోణం పై సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ రాశారు. పల్నాడులో వందల కొట్లలో మైనింగ్ కుంభకోణం జరిగినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో చంద్రబాబుకు కూడా సంబంధం ఉందనేది వైకాపా పరోక్ష వాదన. సీబీఐ కూడా మైనింగ్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపైన విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కుంభకోణం పైనా సీబీఐ విచారణను కోరే అవకశం ఉన్నట్లు సమాచారం. గతంలో జగన్ జైల్లోకి వెళ్ళడానికి చంద్రబాబు వెనుక నుండి కధ నడిపించారని వైకాపా ఆరోపణ. ఏదోరకంగా చంద్రబాబును జైల్లో పెట్టించాలని జగన్ కాసుకుని కూర్చున్నారు. ఈవిషయంలో మోడీ అమిత్ షాలతో జగన్ చర్చలు జరుపుతున్నట్లు డిల్లి రాజకీయ వర్గాల్లో మారుమోగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ముందు రెండే ప్రత్యామ్యాయాలు ఉన్నాయి. గతంలో లాగా మోడీని డీ కొట్టడమా? లేక ఆయన ముందు మోకరిల్లడమా? అనే అంశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. –కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.