కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత పాకిస్థాన్ అణ్వాయుధాలపై చేస్తున్న వ్యాఖ్యలను బట్టి ఆ దేశానికి వాళ్ల సైన్యం సామర్థ్యాలపై నమ్మకమే లేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి ముందస్తు జాగ్రత్తగా పెద్ద ఎత్తున మోహరింపులు చేపడుతోందని అన్నారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఉగ్రదాడి జరిగితే దానికి ప్రతీకారంగా భారత్ తిరగబడుతుంది కాబట్టి నియంత్రణ రేఖ వెంబడి ముందు జాగ్రత్తగా సైన్యాన్ని పాక్ పెంచుతోందని ఎద్దేవా చేశారు. పాకిస్థానీ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఎదురవనుందనే నిఘా వర్గాల సమాచారం ఉన్న నేపథ్యంలో ఏ సవాలునైనా స్వీకరించేలా భారత ఆర్మీ అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. ‘‘పాకిస్థాన్‌కు వారి దళాల సామర్థ్యంపై నమ్మకం లేనందుకే అణ్వాయుధాల ప్రస్తావన తెచ్చి భయపెట్టాలని చూస్తోంది. ఉగ్రవాదులు రెచ్చిపోయేందుకు తమ దేశంలో వారికి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. అంతేకాక పాక్ తన బలగాలను నియంత్రణ రేఖ వెంబడి మోహరిస్తుందనే సూచనలు అందుతున్నాయి. భారత్‌లో ఏదైనా ఉగ్రదాడికి పాల్పడితే, అందుకు దీటైన జవాబు వారు ఆశించవచ్చు. ఏదైనా హింస సృష్టించాలని చూస్తే భారత్ నుంచి తప్పించుకోవడం పాక్ వల్ల కాదు’’ అని హెచ్చరించారు. మరోపక్క కశ్మీర్‌లో నెలరోజులుగా అమలులో ఉన్న భద్రతాపరమైన ఆంక్షలను మెల్లగా సడలిస్తున్న సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాల్లో గురువారం ల్యాండ్‌లైన్ ఫోన్లు పని చేయడం ప్రారంభమయ్యాయి. మొత్తం ఆంక్షలను ఒకేసారి ఎత్తివేస్తే కశ్మీర్‌లో అలజడులు సృష్టించేందుకు పాక్ సిద్ధంగా ఉందని బిపిన్ రావత్ అన్నారు.
పాకిస్థాన్‌కు తమ సైన్యంపైనే నమ్మకం లేదు
Related tags :