DailyDose

నేటి 20 ప్రధాన వార్తలు-09/07

Telugu Top News - నేటి 20 ప్రధాన వార్తలు-09/07

1. జాబిలమ్మ అందినట్లే అంది..
జాబిల్లి అందినట్లే అంది.. చివరి క్షణాల్లో జారిపోయింది. చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ మృదువుగా చంద్రుడిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అన్ని దశలనూ విజయవంతంగా దాటుకుంటూ వచ్చినా గమ్యం ముంగిట్లో తడబాటు ఎదురైంది. ‘2.1 కిలోమీటర్ల వరకూ అంతా బాగానే సాగింది. ఆ తర్వాత ల్యాండర్‌ నుంచి భూ కేంద్రానికి సంకేతాలు స్తంభించాయి. సంబంధిత డేటాను విశ్లేషిస్తున్నాం’ అని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ శాస్త్రవేత్తలను వెన్ను తట్టి ధైర్యం చెప్పారు.
2. ఎంత కష్టపడ్డారో మీ కళ్లే చెబుతున్నాయ్‌!
భారతదేశ విజయం కోసం శాస్త్రవేత్తలంతా తీవ్రంగా ప్రయత్నించారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. భరతమాత తలెత్తుకునేలా జీవితాన్ని ధారపోశారని అన్నారు. చంద్రయాన్‌-ప్రయోగం అనంతరం బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ మీ బాధను నేనూ పంచుకుంటున్నాను. మీ కష్టం మీ కళ్లలో కనిపిస్తోంది. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు మనల్ని మరింత ధృఢంంగా తీర్చిదిద్దుతాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు.
3. రాజుగా భావించి శిల్పులే చెక్కారు
యాదాద్రి అష్టభుజ మండపంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రాన్ని చెక్కించాలని ఎవరూ ఆదేశించలేదని, ఆయన్ను దేవుడిగా, రాజుగా భావించి శిల్పులే సొంతంగా చెక్కారని యాడా వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు. సీఎం చెప్పినందుకే చిత్రాన్ని చెక్కారని వస్తున్న ఆరోపణలు అసత్యమన్నారు. నడుస్తున్న చరిత్రను భవిష్య తరాలకు అందించేందుకు గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ తదితరుల చిత్రాలు, ప్రభుత్వ పథకాలు, క్రీడలు, వాహనాలు తదితరాలన్నీ పొందుపరిచామన్నారు.
4. శ్రీశైలం జలాశయానికి భారీ వరద
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం మొదలైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో అటు ఆలమట్టి ఇటు తుంగభద్ర నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం జూరాల నుంచి 2.53 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నదిపై సుంకేశుల నుంచి 56 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరికొన్ని రోజులు ప్రవాహం కొనసాగే అవకాశం ఉంటే మళ్లీ గేట్లు ఎత్తి కిందకు వదలాల్సి ఉంటుంది.
5. ఆదర్శానికి అది అంకురం..
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అంకుర విధానం దేశానికే ఆదర్శంగా ఉందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రశంసించింది. దీన్ని ఇతర రాష్ట్రాలు అనుసరించాలని సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సులను 15 రోజుల్లోనే అమలు చేస్తామని గడ్కరీ పేర్కొన్నారు.
6. హెచ్‌సీయూలో ప్రపంచస్థాయి ఈ-లెర్నింగ్‌ కేంద్రం
ప్రతిష్ఠాత్మక శ్రేష్ఠతర హోదా దక్కించుకున్న హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) ప్రపంచస్థాయి ఈ-లెర్నింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. డిజిటల్‌ లెర్నింగ్‌ స్టడీస్‌ అండ్‌ ట్రైనింగ్‌ రిసోర్సెస్‌ సెంటర్‌ పేరిట ఇందుకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కేంద్ర మానవ వనరుల శాఖకు సమర్పించింది. ఆమోదం రాగానే కార్యకలాపాలు విస్తృతం కానున్నాయి.
7. పోలీసులకు రెండింతల జరిమానా
‘‘హోంగార్డు నుంచి ఐపీఎస్‌ అధికారి వరకూ ఎవరైనా సరే. విధి నిర్వహణలో ఉండి వాహనంలో వెళ్తున్నపుడు సీటు బెల్టు ధరించకుండా వెళ్లినా, అపసవ్య దారిలో ప్రయాణించినా. సిగ్నల్‌ జంప్‌ చేసినా సెక్షన్‌ 210-బి ప్రకారం రెండింతలు జరిమానా చెల్లించాల్సి వస్తుందని హైదరాబాద్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌(ట్రాఫిక్‌) ఎస్‌. అనిల్‌కుమార్‌ పోలీస్‌ అధికారులకు వెల్లడించారు. ఈ మేరకు ఆయన అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు.
8. రబ్బర్‌ స్టాంపులా ఉండను
‘‘గవర్నర్‌ బాధ్యతలు కీలకం. రబ్బర్‌ స్టాంప్‌లా ఉండను. ప్రభుత్వాలు ప్రజాహితం లేని చట్టాలు చేస్తే వాటిని ప్రశ్నించాలి. ప్రజా జీవితంలో చురుగ్గా ఉన్న సమయంలో ఈ పదవి వస్తుందని ఊహించలేదు’’అని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ హోదాలో కొత్త బాధ్యతలు చేపట్టనుండటం కాలానుగుణమైన మార్పుగా భావిస్తున్నానని అన్నారు. 11న గవర్నర్‌గా ప్రమాణం చేయనున్న దత్తాత్రేయ ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
9. కర్ణాటకలో యువ ఐఏఎస్‌ అధికారి రాజీనామా
‘ప్రజాస్వామ్యానికి ఆధార స్తంభాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా నాశనమయ్యాయి. ఆ గోడలు కూలుతున్నాయి. వ్యవస్థలు రాజీపడుతున్నాయి. ఈ పరిణామాలు దేశాభ్యుదయానికి పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ పాలనా సేవల నుంచి వైదొలగడమే మేలనిపిస్తోంది. సేవల నుంచి వైదొలగుతున్నా ప్రజా సంక్షేమం కోసం ప్రయత్నాన్ని కొనసాగిస్తా’ అని కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా అధికారి శశికాంత్‌ సెంథిల్‌ ప్రకటించి ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు.
10. చంద్రయాన్‌-2 ప్రయోగం. ఉద్విగ్న క్షణాలు…
తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖాధికారులు వెల్లడించారు. ఉత్తర తెలంగాణలో రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో అతిభారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు…
11. పల్నాడు పరిస్థితులు అదుపులోనే: ఐజీ బ్రిజ్‌లాల్‌
గుంటూరు జిల్లా పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారులు పర్యటించారు. కోస్తా ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌, గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పర్యటించి శాంతిభద్రతలను సమీక్షించారు. అనంతరం పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌లో బ్రిజ్‌లాల్‌, విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం ఉందని, ఎన్నికల తర్వాత ఇక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని బ్రిజ్‌లాల్‌ వెల్లడించారు.
12. నిజామాబాద్‌ జిల్లాకు చేరిన కాళేశ్వరం జలాలు
కాళేశ్వరం జలాలు నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లికి చేరాయి. దీని కోసం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని రాజేశ్వర్‌రావు పేట పంప్‌హౌస్‌ నుంచి రెండు పంపులు నీటిని ఎత్తిపోస్తున్నాయి. దీంతో కాళేశ్వరం జలాలతో ఎస్‌ఆర్‌ఎస్పీ వరద కాలువ జలకళను సంతరించుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు పునరుజ్జీవన పథకంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రామ్‌పూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంపుహౌజ్‌ల ద్వారా నిజామాబాద్‌లోని ముక్కల్‌ వద్ద నిర్మించిన పంపుహౌస్‌ నుంచి ఎస్ఆర్‌ఎస్పీ వరద కాల్వలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.
13. గోదావరి – శ్రీశైలం అనుసంధానంపై 11న భేటీ
గోదావరి నీటిని శ్రీశైలం జలాశయంలోకి మళ్లించే అనుసంధాన పథకంపై ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులు భేటీ కానున్నారు. హైదరాబాద్‌లో ఈ సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ జలవనరులశాఖ అధికారులు తేదీని ప్రతిపాదించి ఏపీ జలవనరులశాఖ అధికారులకు తెలిపారు. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, అంతర్రాష్ట్ర జలవనరులశాఖ చీఫ్‌ ఇంజినీరు నరసింహారావు, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
14. ‘దత్తాత్రేయ అందిరివాడు.. ఎవరినీ నొప్పించరు’
హిమాచల్‌ప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని దత్తాత్రేయ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛంతో ఆయనను సత్కరించారు. మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. తెలంగాణ ముద్దు బిడ్డకు గవర్నర్‌ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయతో ఉన్న అనుబంధాన్ని ఎర్రబెల్లి గుర్తు చేసుకున్నారు. దత్తాత్రేయ అందరివాడని.. ఆయన ఎవరి మనసూ నొప్పించరని కొనియాడారు.
15. వైకాపా పాలనపై తెదేపా పుస్తకం
వైకాపా ప్రభుత్వ వందరోజుల పాలన వైఫల్యాలపై తెదేపా ఓ పుస్తకాన్ని సిద్ధం చేసింది. గత 100రోజుల పాలనలో ప్రజావేదిక కూల్చివేత నుంచి రాజధాని పనులు నిలిపివేత, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవటం, తెదేపా నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు, తెదేపా హయాంలో అమలు చేసిన వివిధ అభివృద్ధి పథకాల రద్దు తదితర అంశాలన్నింటినీ అందులో పొందుపరిచినట్లు సమాచారం.
16. శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 1,74,986 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 47,421 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ.. 73,287 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 24,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
17. గోదారికి పెరిగిన వరద..ఆందోళనలో కోనసీమ
గోదావరికి మళ్లీ వరద పోటెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వాసుల్లో ఆందోళన నెలకొంది. పి.గన్నవరం మండలం చాకలిపాలెం సమీపంలోని కాజ్‌వేపై వరద జోరుగా ప్రవహిస్తోంది. కనకాయలంక గ్రామ ప్రజలు నాటు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. కోనసీమలో వశిష్ఠ, వైనతేయ, గౌతమి, గోదావరి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సహాయక చర్యలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
18. మోదీజీ..రాష్ట్రపతి అవ్వడం ఎలా?
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్ష్యంగా వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు దేశవ్యాప్తంగా 70మంది పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్న మోదీని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు ఆయన కూడా సరదాగా జవాబిచ్చారు. ‘భారత రాష్ట్రపతి కావాలనేది నా లక్ష్యం. దాన్ని చేరుకోవాలంటే నేనేం చేయాలి?’ అని ఓ విద్యార్థి ప్రధాని మోదీని ప్రశ్నించాడు.
19. దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ నోటీసులు
భారత ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసుల
ు జారీచేసింది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు అతడికి నోటీసులు పంపింది. ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు, సీపీఎల్‌లోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ యజమాని. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కార్తీక్‌ సారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
20. మెగాస్టార్‌కి తమిళస్టార్‌ డబ్బింగ్‌..?
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు, తమిళ, మలయాళంతోపాటు హిందీ భాషలలో ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళ వెర్షన్‌లో చిరంజీవికి తమిళ స్టార్ అరవింద్ స్వామి డబ్బింగ్‌ చెప్పనున్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.