తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కానుకలు ఏటా రెట్టింపవు తున్నట్టు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ శుక్రవారం చెప్పారు. 2019-–20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు హుండీ ఆదాయం రూ.497.29 కోట్లు వచ్చిందన్నారు. గతేడాది ఇదే టైంకు రూ.450.54 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈసారి అదనంగా రూ.46.70 కోట్లు వచ్చాయని తెలిపారు. ఈసారి 524 కిలోల బంగారు కానుకలను సమర్పించారని, గతేడాది 5 నెలలతో పోలిస్తే 180 కిలోలు అధికమని చెప్పారు. 3,098 కిలోల వెండి కానుకలు వచ్చాయన్నారు. టీటీడీలోని 10 ట్రస్టులు, ఒక స్కీంకు ఐదు నెలల్లో రూ.140.46 కోట్లు లభించగా, 2017లో రూ.91.91 కోట్లు, 2018లో రూ.113 .96 కోట్లు లభించినట్టు టీటీడీఈవో అనిల్కుమార్ సింఘాల్ చెప్పారు.
**ఆన్‌లైన్‌లో 68 వేల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి డిసెంబరు నెల కోటాలో 68,466 టికెట్లను శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 6,516 సేవా టికెట్లు విడుదల చేయగా, అందులో సుప్రభాతం 3,856, తోమాల 60, అర్చన 60, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2,300 టికెట్లు ఉన్నాయి. ఇక ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 61,950 సేవాటికెట్లు ఉన్నాయి. వాటిలో విశేషపూజ 2,500, కల్యాణం 13,775, ఊంజల్‌సేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,950, సహస్రదీపాలంకారసేవ 17,400 టికెట్లు ఉన్నాయి.