DailyDose

నేటి తాజావార్తలు-09/08

Todays Top Breaking News - Sep 8 2019

1. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ముగిసింది. కొత్త మంత్రులుగా ఆరుగురికి సీఎం కేసీఆర్‌ అవకాశం కల్పించారు. రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు.. ఆ తర్వాత వరుసగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (సిరిసిల్ల), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), సత్యవతి రాఠోడ్‌ (వరంగల్‌ ఎమ్మెల్సీ), పువ్వాడ అజయ్‌కుమార్‌ (ఖమ్మం) మంత్రులుగా ప్రమాణం చేశారు.

2. విక్రమ్‌ ఆచూకీ తెలిసింది: ఇస్రో
చంద్రయాన్‌-2లో పురోగతి లభించింది. విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని గుర్తించినట్లు నేడు ఇస్రో ప్రకటించింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ స్వయంగా వెల్లడించారు. ఆర్బిటర్‌ చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్‌ థర్మల్‌ చిత్రాలను తీసిందని తెలిపారు. ల్యాండర్‌తో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో ల్యాండర్‌తో సంబంధాలు ఏర్పడే అవకాశముందని శివన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

3. కేంద్రం ఆర్టికల్‌ 371 జోలికి వెళ్లదు
ఈశాన్య రాష్ట్రాలకు కొన్ని అంశాల్లో ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 371 జోలికి వెళ్లబోమని కేంద్ర హోంమంత్రి అమిషా పునరుద్ఘాటించారు. గువహటిలో ఆదివారం జరిగిన ఈశాన్య రాష్ట్రాల మండలి 68వ ప్లీనరీ సమావేశానికి హాజరైన ఆయన ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి అందిస్తున్న ఆర్టికల్‌ 370ను తాత్కాలికంగా ఏర్పాటు చేసినందునే దాన్ని రద్దు చేశామని, కానీ ఆర్టికల్‌ 371 ఈశాన్య రాష్ట్రాలకు కొన్ని అంశాల్లో ప్రత్యేక అధికారాలు అందిస్తోందని వెల్లడించారు.

4. వంద రోజుల్లో పెను మార్పులు: మోదీ
ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ వంద రోజుల్లో అభివృద్ధితో పాటు దేశంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందన్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా వంద రోజుల పాలనపై ఆయన మాట్లాడారు. ఈ వంద రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం అనేక కీలకమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు.

5. ఎన్నికేసులు పెడతారో నేనూచూస్తా:చంద్రబాబు
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పల్నాడును రక్షించుకోవడానికి ఈనెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘తెలుగుదేశం ఓ వ్యక్తి కాదు.. ఓ పెద్ద వ్యవస్థ’’ అని చలో ఆత్మకూరు కార్యక్రమం ద్వారా చాటాలన్నారు. పోలీసులు పెట్టే ప్రతి అక్రమ కేసుకూ సమాధానం చెప్పేలా దీన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఎన్ని కేసులు పెడతారో తానూ చూస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

6. పాక్‌లో భారీగాపెట్టుబడులు పెట్టనున్న చైనా
పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు చైనా మరో అడుగు ముందుకుకేసింది. పాక్‌ సంక్షేమ ప్రాజెక్టుల్లో 1బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపింది. పాకిస్థాన్‌కు చైనా రాయబారి యవో జింగ్‌ శనివారం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. చైనా-పాక్‌ మధ్య ఉన్న ఎకనామిక్‌ కారిడార్‌ సంతృప్తికరంగా ఉందన్నారు. చైనా-పాకిస్థాన్‌ ఉచిత వాణిజ్య ఒప్పందం రెండో దశను ఈ ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

7. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన కార్తీక్‌
భారత ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు అతడికి నోటీసులు పంపించింది. దీంతో దినేశ్‌ కార్తీక్‌ బీసీసీఐకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు. మ్యాచ్‌ను వీక్షించడానికి కోల్‌కతా నైట్ రైడర్స్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ కోరడంతో అక్కడికి వెళ్లానని తెలిపాడు.

8. పేలుడులో గాయపడ్డ వ్యక్తి మృతి
నగరంలోని రాజేంద్రనగర్‌లో వద్ద జరిగిన పేలుడులో గాయపడిన వ్యక్తి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నేటి ఉదయం పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌వే 279 పిల్లర్‌ వద్ద భారీ పేలుడు చేసుకుంది. ఈ ఘటనలో అలీ(35) తీవ్రంగా గాయపడ్డాడు. ఫుట్‌పాత్‌ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ కవర్‌ను తెరుస్తుండగా పేలుడు సంభవించింది.

9. పెరగనున్న టయోటా వాహన ధరలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా క్రిల్లోస్కర్‌ డీజిల్‌ వాహన ధరలు 15-20శాతం పెరిగే అవకాశం ఉందని కంపెనీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది బీఎస్‌-vi ప్రమాణాలతో కూడిన వాహనాలను తయారు చేయనున్న దృష్ట్యా అందుకు తగిన విధంగా ధరలను కూడా పెంచనున్నట్లు తెలిపారు.

10. ఆ సమన్వయంతో మోదీ నిర్ణయాలు: కిషన్‌రెడ్డి
ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకునేది భాజపా మాత్రమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయిన సందర్భంగా భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ముందుచూపు, సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ప్రధాని మోదీ నిర్ణయాలు ఉన్నాయని చెప్పారు. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్నారన్నారు.