వినాయక ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని భోలక్‌పూర్ డివిజన్లో ఏర్పాటు చేసిన మండపం వద్ద బంగారు లడ్డూ వేలం కోలాహలంగా జరిగింది. శ్రీసిద్ధి వినాయక భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోలక్‌పూర్‌లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్ నిర్వాహకులు బుధవారం స్వామివారి ప్రసాదంగా వుంచిన లడ్డూకు వేలం పాట నిర్వహించారు. ప్రసాదం లడ్డూతో పాటు ఆకర్షణ గొల్పేందుకు బంగారం లడ్డూను వేలంలో ఉంచడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది రూ.5 లక్షల విలువ చేసే 123 గ్రాముల బంగారం లడ్డూను నిర్వాహకులు తయారు చేయించారు. నిమజ్జనానికి ఒక రోజు ముందు వేలంపాట నిర్వహించడంతో భక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. రూ.5001 నుంచి ప్రారంభమైన వేలం పాట రూ.7.56 లక్షతో ముగిసింది. స్థానిక చేపల విక్రయ వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ ఈ బంగారు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది ఏర్పాటు చేసిన వేలంపాటలో 120 గ్రాముల బంగారు లడ్డూను స్థానికుడు కె.భాస్కర్ రూ.8.1లక్షలకు సొంతం చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి లడ్డూ తక్కువ ధర పలకడం గమనార్హం. ఈ వేలం కార్యక్రమానికి ముఖ్య అతిథులగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెరాస యువజన విభాగ నాయకుడు జయసింహ, భాజపా నియోజకవర్గ కో-కన్వీనర్ నవీన్ గౌడ్, అసోసియేషన్ నిర్వాహకులు జి.అనిల్ తదితరులు పాల్గొన్నారు.
భోలక్‌పూర్ బంగారు లడ్డూ ధర లక్షల్లోనే…
Related tags :