తనపై బనాయించినవి అక్రమ కేసులని.. వాటిని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమని తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాల నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్న సమయంలో చింతమనేని మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఫిర్యాదుదారుల్ని భయపెట్టి తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. కేసులు పెట్టి తన కుటుంబాన్ని, తెదేపా కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ మధ్యకాలంలో నేను ఒక్కరోజు కూడా బయటకు రాలేదు. మీడియా ముందు కనిపించలేదు. నా పనేదో నేను చేసుకుంటున్నా. ప్రశాంతంగా ఉన్న నన్ను రెచ్చగొట్టారు. ఏం చేయదలుచుకున్నారో చేయండి. ఏ విచారణకైనా నేను సిద్ధం’’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. తనపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే ఆస్తులన్నీ పేదలకు రాసిస్తానని..లేదంటే బొత్స తన పదవి నుంచి తప్పుకుంటారా అని ఆయన సవాల్ విసిరారు. జిల్లాలో తెదేపా లేకుండా చేయడానికే తనపై కుట్రలు చేస్తున్నారని చింతమనేని ప్రభాకర్ దుయ్యబట్టారు.
నేను అమాయకుడిని. నాపైనవన్నీ అక్రమ కేసులు. నన్ను రెచ్చగొట్టారు.
Related tags :