Health

మీ కిడ్నీల పనితీరు ఇక్కడ సరిచూసుకోండి

Simple checks to test your kidneys functionality

మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. కిడ్నీలు వ్యర్థాలను వడబోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత కాలం మనకు ఎలాంటి సమస్యలూ రావు. కానీ కిడ్నీలు పాడైతే మాత్రం మనకు అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మూత్రం ఎప్పుడూ రంగు మారి వస్తుంటే కిడ్నీల సమస్య ఉన్నట్లు గుర్తించాలి. సాధారణ రంగులో కాకుండా మూత్రం రంగు మారి వస్తుంటే కిడ్నీ చెకప్ చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.

2. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే వ్యర్థాలు రక్తంలోనే ఉంటాయి. దీంతో నోట్లో దుర్వాసన వస్తుంది. అలాగే ఆకలి కూడా బాగా తగ్గుతుంది.

3. తరచూ వికారం, వాంతుల సమస్య ఉన్నా కిడ్నీ సమస్యేమోనని అనుమానించాలి. వైద్య పరీక్షలు చేయించుకుని సమస్య ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులను వాడడమో, శస్త్ర చికిత్స చేయించుకోవడమో చేయాలి.

4. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థ ద్రవాలు అలాగే ఉంటాయి. దీంతో ఆ ద్రవం పలు భాగాల్లోకి చేరి శరీరం ఉబ్బినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కిడ్నీలు పాడైతే కాళ్లు, చేతులు బాగా వాపునకు లోనవుతాయి. అవి ఉబ్బిపోయి కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.

5. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఆ ప్రభావం వల్ల శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి రక్తహీనత వస్తుంది. దీంతో తీవ్రమైన అలసట ఉంటుంది. ఈ సమస్య ఉన్నా స్పందించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

6. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే చర్మంపై దద్దుర్లు కూడా వస్తుంటాయి. అలాగే కిడ్నీలు ఉండే వీపు ప్రాంతంలో పొడిచినట్లు నొప్పి వస్తుంది.

7. కిడ్నీ సమస్య ఉంటే శ్వాస తీసుకునే ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడుతాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏకాగ్రత ఉండదు. వాతావరణం ఎలా ఉన్నా సరే చల్లని ఫీలింగ్ కలుగుతుంది. ఈ లక్షణాలు గనక ఎవరిలోనైనా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా చికిత్స తీసుకుంటే కిడ్నీలు మరింత పాడవకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. లేదంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేందుకు అవకాశం ఉంటుంది.