భారత్ టెస్టు క్రికెట్ ప్రస్థానం మొదలై దాదాపు 87 ఏళ్లు అవుతోంది. కానీ, ఇప్పటివరకు సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా తరఫున నమోదైన ట్రిపుల్ సెంచరీలు కేవలం మూడే. వాటిలో రెండు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌వే. సెహ్వాగ్ అంటే క్రికెట్ ప్రపంచానికి గుర్తొచ్చేది అతడి విధ్వంసమే. బౌలర్ల పాలిట అతడు అరివీర భయంకరుడు. క్రీజ్‌లో ఉన్నంతసేపు బౌలర్లకు పీడకలగా మార్చే మహాయోధుడు. ఫుట్‌వర్క్ లేకుండా ఉన్నచోట నుంచే బంతిని బౌండరీ దాటించే హిట్టర్. సుదీర్ఘ ఫార్మాట్‌లో శతకొట్టాలంటే మహామహా బ్యాట్స్‌మెన్‌కు క్రీజ్‌లో కుదురుకుంటే సరిపోతుంది. ద్విశతకం బాదాలంటే కాస్త ఓర్పు ఉంటే పనైపోతుంది. అదే ట్రిపుల్ సెంచరీ చేయాలంటే..? అంత తేలికైన విషయం కాదు. కానీ, అలాంటి త్రిశతకాలను సెహ్వాగ్ ఏకంగా రెండు సార్లు బాదేశాడు. తొలి ట్రిపుల్ సెంచరీని చిరకాల ప్రత్యర్థి పాక్‌పై బాదగా రెండోది సఫారీలపై చేశాడు. మరో కొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరేంద్రుని వీరవిహారాన్ని ఓ సారి చూద్దాం..
వివ్ రిచర్డ్స్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత దూకుడు ఇన్నింగ్స్ ఆడే ఆటగాడి కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. హిట్టింగ్ చేస్తున్నా అతడి స్థాయిలో ఎవరూ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కానీ వీరేంద్ర సెహ్వాగ్ రాకతో విధ్వంసం కోరుకునే అభిమానులు ఎంతో సంతోషించారు. భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ 1999లో అరంగ్రేటం చేశాడు. తొలి మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఒక పరుగు మాత్రమే చేశాడు. తర్వాత ఎన్నో మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. గంగూలీ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత సెహ్వాగ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కివీస్‌పై శతకం బాది అతడి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు. టీమ్‌ఇండియా డాషింగ్ ఓపెనర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.
2008లో దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటించింది. టీమ్‌ఇండియాతో మూడు టెస్టులు ఆడింది. సిరీస్‌ను డ్రాగా ముగించినా సఫారీలకు చేదు అనుభవమే మిగిలింది. సెహ్వాగ్ ఊచకోతకు పర్యటన పీడకలగా మారింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి టెస్టు జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో గ్రేమ్‌స్మిత్ సేన 540 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా 159 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్‌కు కష్టాలు తప్పవని భావించారంతా. కానీ సెహ్వాగ్ ఇన్నింగ్స్‌ను చూసిన తర్వాత కష్టాలు టీమ్‌ఇండియాకు కాదు సఫారీలకు అనేలా పరిస్థితి మారిపోయింది. అలా సాగింది సెహ్వాగ్ విధ్వంసం. స్పిన్నర్, పేసర్ అనే తేడా లేకుండా సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. 42 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 319 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా ఇండియన్ వాల్ రాహుల్ ద్రవిడ్ శతకంతో కదంతొక్కగా భారత్ 627 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టాడు. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్, వికెట్ కీపర్ మార్క్ బౌచర్‌ను బోల్తా కొట్టించాడు. మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది.
‘‘వికెట్ కాపాడుకోవడం కంటే పరుగులు చేయడమే ముఖ్యం. కొట్టాల్సిన బంతి వచ్చినప్పుడు కొట్టడమే నా పని. అది నా సహజ స్వభావం. మ్యాచ్ తొలి బంతి అయినా, సెంచరీకి చేరువలోనైనా విధ్వంసమే నా లక్ష్యం’’: సెహ్వాగ్
కరుణ్ నాయర్ చలవతో చెన్నైలోని చెపాక్ స్టేడియం భారత బ్యాట్స్‌మెన్ ట్రిపుల్ సెంచరీలకు వేదికగా మారిపోయింది. సెహ్వాగ్ భారీ ఇన్నింగ్స్ సాధించిన చెపాక్ స్టేడియంలోనే ఎనిమిదేళ్ల తర్వాత యువ ఆటగాడు కరుణ్ నాయర్ త్రిశతకం బాదేశాడు. 2016లో భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై అతడు విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ చేసిన 477 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ను టీమ్‌ఇండియా అందుకుంటుందో లేదో అని అందరూ అనుకున్నారు. కానీ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో పాటు రాహుల్ 199 పరుగులతో చెలరేగగా భారత్ ఏకంగా 759 రికార్డు పరుగులు సాధించి మ్యాచ్‌ను గెలుచుకుంది. కరుణ్ నాయర్ తర్వాత భారత్ తరఫున ఇప్పటివరకు త్రిశతకాన్ని ఎవరూ సాధించలేకపోయారు. ప్రస్తుత భారత జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్‌కు కొదవలేదు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ, నయా వాల్ ఛతేశ్వర్ పుజారా, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, అజింక్య రహానె వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లతో పాటు హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, రిషభ్ పంత్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లంతా సంచనాలను సృష్టించగలిగే బ్యాట్స్‌మెన్. అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ మూడు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లో సెహ్వాగ్, కరుణ్ త్రిశతక రికార్డును ఎవరైనా అందుకుంటారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.