Politics

కుంభకోణాలు నాకు నచ్చదు. అవి లేకుండా చూడండి.

YS Jagan Wants A Scam Free Project Budget

సాగునీటి ప్రాజెక్టుల్లో కుంభకోణాలు లేకుండా చూడాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జలవననరుల శాఖ ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనుల వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ ఏడాది కృష్ణా వరద జలాలు బాగా వచ్చాయని.. అయినా రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి సమయం పడుతోందని సీఎం అన్నారు. ఈ విషయంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రాయసీమలో కొన్ని ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఆశించిన మేర నీరు ప్రాజెక్టుల్లో చేరలేదని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. వరద జలాలు 30-40 రోజులకు మించి ఉండవనే అంచనాతో ప్రణాళిక సిద్ధం చేయాలని.. 30 రోజుల్లోనే ప్రాజెక్టులు నింపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏ పని చూసినా కుంభకోణమే కనిపిస్తోందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌-1, టన్నెల్‌-2 పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. దీంతో వరదనీరు ప్రాజెక్టుల్లోకి చేరడం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. ప్రతి జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టు పనుల ప్రగతికి సంబంధించిన సమగ్ర వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పోలవరం ప్రాజెక్టుపైనా చర్చ జరిగింది. పోలవరం పునరావాస పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించినా ఆశించిన ప్రగతి లేదని.. ఆయా పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సీఎం సూచించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపైనా వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రలోని పలు ప్రాజెక్టుల అంశంలో పక్క రాష్ట్రమైన ఒడిశా అభ్యంతరాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంలో ఒడిశాతో సీఎంతో చర్చలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.