Movies

శ్రద్ధాకు మానసిక వ్యాధి

Shraddha Kapoor Fighting Against Anxiety Disorder Since Six Years

‘చిచ్చోరే’, ‘సాహో’ సినిమాల సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్‌. 2010లో నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత అనేక హిట్లు అందుకున్నారు. ‘ఆషికీ 2’, ‘ఏక్‌విలన్‌’, ‘ఏబీసీడీ 2’, ‘బాఘీ’ తదితర సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. నటిగా శ్రద్ధా కెరీర్ మంచి ట్రాక్‌పైనే నడుస్తోందని చెప్పాలి. ప్రస్తుతం ఆమె ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’ సినిమాలో వరుణ్‌ ధావన్‌తో కలిసి నటిస్తున్నారు. ‘బాఘి 3’లోనూ నటించనున్నారు. అయితే అలాంటి ఆమె కూడా ఓ రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారట. గత ఆరేళ్లుగా మానసిక ఆందోళన, వేదనతో పోరాడుతున్నానని ఆమె తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో చెప్పారు. ఆ సమస్యకు వ్యతిరేకంగా పోరాడుదామంటే.. అదేంటో, ఎలా ఉంటుందో కూడా తెలియడం లేదని అన్నారు. ‘యాంగ్జైటీ అంటే ఏంటో నాకు తెలియదు. గతంలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ‘ఆషికీ 2’ తర్వాత నుంచి ఈ సమస్యతో నేను బాధపడుతున్నా, దీనికి శారీరక నిర్ధారణ లేదు. మానసికంగా గుర్తించాలి. మొదట చాలా వైద్య పరీక్షలు చేశారు. కానీ వైద్యులు ఎటువంటి సమస్యను గుర్తించలేకపోయారు. కానీ నాకు నొప్పి, బాధ ఎందుకు వచ్చేవో అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టా’. ‘ఇవాళ్టికీ యాంగ్జైటీతో పోరాడుతున్నా.. కానీ గతంతో పోల్చితే కాస్త ఫర్వాలేదు. ఆ బాధను ద్వేషించి, దూరం పెట్టాలి అనుకోవడం కన్నా.. స్వీకరించి, ప్రేమగా తగ్గించుకోవడం మంచిది. అప్పుడు సమస్య పరిష్కారంలో చాలా తేడా కనిపిస్తుంది. ముందు మనమేంటో మనం గుర్తించాలి. మనకేం కావాలో అర్థం చేసుకోవాలి’ అని ఆమె చెప్పారు.