Food

ఈ చపాతీలు తినాలంటే సూత్రం పలకాల్సిందే

Bellary Special Ahimsa Chapathi

అహింసకు చపాతీలకు సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీరు చదివితీరాల్సిందే. బళ్లారి కాళమ్మవీధిలోని బండారి ఎలక్ట్రికల్స్‌ యజమాని ఇంటి ముందు రోజూ ఇద్దరు వృద్ధదంపతులు కూర్చుని ఉంటారు. ఏమిటా అని దగ్గరకు వెళ్లి చూస్తే వాళ్లవద్ద పాత్రల్లో ఒకదాంట్లో చపాతీలు, మరొకదాంట్లో పాలు దర్శనమిస్తాయి. అమ్మకానికి పెట్టుకున్నారేమో అని అడిగితే కాదు ..కాదు ఉచితంగానే ఇస్తామంటారు. సరే ఇవ్వండంటే ఒక షరతు ఉందంటారు. ఏమిటది అంటే కూర్చో చెబుతామంటారు. తీరా కూర్చున్న తర్వాత చపాతీలు చేతికిచ్చి అహింసా పరమోధర్మః అని మూడు సార్లు అనిపిస్తారు. అంతే షరతు పూర్తయినట్టే. ఇంకేముంది? ఉచితంగా చపాతీలు, పప్పు లాగించి వేడివేడిగా పాలు తాగిరావడమే. పాత్రల్లో సరుకు ఐపోయేంతవరకూ వారు అక్కడినుంచి కదలరు. పండగ రోజయినా, మూమూలు రోజయినా వారికది మామూలే. ఆ వృద్ధదంపతుల పేర్లేమిటంటారా? దాలిచంద్‌ (88), సానిదేవి (85). వీరి కుటుంబం నాలుగు దశబ్దాల క్రితం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ప్రాంతం నుండి బళ్లారికి వచ్చి స్థిర పడింది. గత నాలుగు సంవత్సరాలుగా వీరు ఈ ఉచిత చపాతీసేవ అందిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒకరిచేత దాలిచంద్‌ మాత్రం అహింస పరమోధర్మః అని చెప్పకుండా మాత్రం చపాతీలు ఇవ్వడు. అదండీ సంగతి. అహింసా చపాతీల రుచి మాత్రం అదుర్స్‌. ఇక మీ ఇష్టం! బళ్లారి ఎప్పుడెళతారో ఏమిటో?!