Health

డెంగీకి బొప్పాయి మంచిదేనా?

Is Papaya really good for dengue victims?

డెంగీ అనగానే మీలాగే అందరికీ ముందుగా ప్లేట్‌లెట్‌ కణాలే గుర్తుకొస్తాయి. డెంగీలో అసలు సమస్య ప్లేట్‌లెట్లు తగ్గటం కాదు. రక్తనాళాల్లోంచి ప్లాస్మాద్రవం లీకై రక్తం చిక్కపడటం. బొప్పాయి ఆకు రసంలోని రసాయనాలు కొంతవరకు ప్లేట్‌లెట్లు పెంచుతున్నట్టు కొన్ని పరిశోధనల్లో తేలిన మాట నిజమే అయినా అవి డెంగీ చికిత్సకు సరిపడేంత స్థాయిలో లేవన్నది గుర్తించాలి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ కేంద్ర ప్రభుత్వం గానీ వీటిని సిఫారసు చేయటం లేదు. బొప్పాయి పండ్లు, కివీ, జామ పండ్లు, కలబంద రసం వంటివీ డెంగీ తగ్గటానికి ఉపయోగపడవని తెలుసుకోవాలి. వీటి మీద ఆధారపడి చికిత్స తీసుకోకపోవటం సరికాదు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలు విపరీత పరిణామాలకు దారితీయొచ్చు. మనదగ్గర ప్లేట్‌లెట్ల విషయంలోనూ చాలా అపోహలున్నాయి. ప్లేట్‌లెట్లు ఏమాత్రం తగ్గినా బెంబేలెత్తి పోతుంటారు. ఇది సరైనది కాదు. డెంగీ నూటికి 99% మందికి మామూలు జ్వరంగానే వచ్చి పోతుంటుంది. చాలామందికి ఇది వచ్చినట్టయినా తెలియదు. ఒక్క శాతం మందిలోనే సమస్యాత్మకంగా మారుతుంది. వీరిని మాత్రమే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి వస్తుంది. డెంగీ జ్వరంలో తొలి (ఫిబ్రైల్‌), విషమ (క్రిటికల్‌), ఉపశమన (రికవరీ).. ఇలా మూడు దశలుంటాయి. దాదాపు ఐదు రోజుల వరకు సాగే తొలిదశలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. దీంతో కంగారు పడిపోయి, భయంతో ఆసుపత్రికి పరుగెడుతుంటారు. ఈ దశలో వాంతుల వంటి ఇతరత్రా లక్షణాలేవీ లేకపోతే ప్యారాసిటమాల్‌ మాత్రలు తీసుకుంటే సరిపోతుంది. అసలు జాగ్రత్తగా ఉండాల్సింది జ్వరం తగ్గిన తర్వాత మొదలయ్యే విషమ దశలోనే. ఇది రెండు, మూడు రోజుల వరకు ఉంటుంది. రక్తం చిక్కపడటం, హిమోగ్లోబిన్‌ మోతాదులు ఎక్కువవటం, రక్తపోటు పడిపోవటం వంటివి తలెత్తేది ఇందులోనే. ఈ సమయంలో కొందరికి ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోవచ్చు. కొందరిలో లోపలి అవయవాల్లోకి రక్తస్రావం కావొచ్చు. అందువల్ల వాంతులు, కడుపునొప్పి, అస్థిరత, చికాకు, మగత, అపస్మారం, చిగుళ్ల వంటి భాగాల నుంచి రక్తం రావటం, చర్మం మీద ఎర్రటి చుక్కల్లాంటి మచ్చలు, రక్తపోటు పడిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం తాత్సారం చేయరాదు. ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గినప్పుడు, హిమోగ్లోబిన్‌ మోతాదు 20% కన్నా పెరిగినప్పుడు, రక్తం గడ్డకట్టే ప్రక్రియ దెబ్బతింటున్నప్పుడు జాగ్రత్త అవసరం. ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో చేర్చి తగు చికిత్స చేయాల్సి ఉంటుంది. రక్తస్రావ లక్షణాలేవీ లేకపోతే ప్లేట్‌లెట్ల సంఖ్య 10వేలకు పడిపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. అదే రక్తస్రావ సూచనలు కనిపిస్తుంటే ప్లేట్‌లెట్ల సంఖ్య 20వేలకు తగ్గినా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తారు. అంతే తప్ప అందరికీ ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి. చాలామంది పెద్దగా ఇబ్బందులేవీ లేకుండానే విషమ దశ నుంచి బయటపడతారు. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు. అతి కొద్దిమందిలోనే డెంగీ తీవ్రరూపం (ఎక్స్‌పాండెడ్‌ డెంగీ) దాలుస్తుంది. వీరిలో కొందరిలో ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమం, గుండె, మెదడు వంటి అవయవాలు దెబ్బతినొచ్చు. అంతే తప్ప డెంగీ అందరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుందని అనుకోవటం పొరపాటు.
* జ్వరం రాగానే కొందరు లీటర్ల కొద్దీ పండ్ల రసాలు తాగించటం చేస్తుంటారు. దీంతో రక్తంలో పొటాషియం మోతాదులు పెరిగి ఇతరత్రా సమస్యలు తలెత్తొచ్చు. వీటికి బదులు నీటిలో ఓఆర్‌ఎస్‌ పొడిని కలిపి తాగించటం మేలు.
* తలనొప్పి, ఒంటినొప్పులు మొదలవ్వగానే కొందరు నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటుంటారు. ఇది తగదు. జ్వరం తగ్గటానికి ప్యారాసిటమాల్‌ మందు తీసుకుంటే చాలు.