Movies

భారతీయుల దెబ్బకు భయపడి విదేశాల్లో షాపింగ్

Tapsee Now Shopping In Foreign Countries Due To Abusive Fans

నో మీన్స్‌ నో. ఈ పదాన్ని బాలీవుడ్‌ బిగ్‌బీ నోట, కోలీవుడ్‌ స్టార్‌ కథానాయకుడు అజిత్‌ నోట సినీ ప్రియులు వినే ఉంటారు. ఎందుకుంటే హిందీ చిత్రం పింక్‌లో నటుడు అమితాబ్‌ బచ్చన్, దాని తమిళ రీమేక్‌ నేర్కొండ పార్వై చిత్రంలో అజిత్‌ చెప్పిన డైలాగ్‌ నో మీన్స్‌ నో. ఈ చిత్రాల్లో న్యాయస్థానంలో మహిళల విషయంలో నో అంటే చిన్న విషయం కాదని, అందులో చాలా భావం ఉందని స్ట్రాంగ్‌గా చెప్పారీ స్టార్స్‌. కాగా పింక్‌ హిందీ చిత్రంలో నటి తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు దక్షిణాదిలో గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్‌లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో రాణిస్తోంది. కాగా తాప్సీ తాజాగా ఒక భేటీలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకున్నారు. ‘జీవితంలో నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. సెలబ్రెటీని కావడంతో నేను పుట్టి పెరిగిన ఢిల్లీలో కూడా బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసి వెళ్లినా నాకే కాదు, నాతో వచ్చేవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నో మీన్స్‌ నో అన్నది ప్రజలు ఇంకా అర్థం చేసుకోవడం లేదు. ఇలాంటి సమస్యల కారణంగానే నేను ఏదైనా షాపింగ్‌ చేయాలంటే విదేశాల్లోనే చేసుకుంటున్నాను. నిజానికి నాకు మాల్స్‌కు వెళ్లి షాపింగ్‌ చేయడం చాలా ఇష్టం. అయితే ఇండియాలో అలా చేయలేకపోతున్నాను. ప్రజలు నేనంటే అభిమానం చూపిస్తున్నారన్నది సంతోషకరమైన విషయమే. అయితే హద్దులు దాటి నా వ్యక్తిగత జీవితంలోకి రావడం నన్ను బాధకు గురి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో సెలబ్రిటిని అయిన తరువాత నా జీవితం తలకిందులైంది’ అని అంటోంది తాప్సీ.