తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవహ్నిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో టిటిడిలోని అన్ని విభాగాలు సెప్టెంబరు 25వ తేదీకి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం వివిధ విభాగాలకు సంబంధించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకాధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో సంతృప్తి కరంగా పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వసతి కేటాయింపు కౌంటర్ల వద్ద రెండు వారాల క్రితం ఏర్పాటు చేసిన స్వైపింగ్ యంత్రాలతో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండా నగదు రహిత చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇది విజయవంతమైన ఫలితాలను ఇచ్చిందని, శ్రీ పద్మావతి వసతి సమూదాయాలలో 72 శాతం, సి.ఆర్‌వో (జనరల్), కౌస్తుభం వసతి కేటాయింపు కేంద్రాలలో 40 శాతం నగదు రహిత లావాదేవిలు జరిగినట్లు తెలిపారు. త్వరలో 100 శాతం నగదు రహిత చెల్లింపులు జరిపి మరింత పారదర్శకతతో భక్తులకు సేవలు అందిస్తామన్నారు. తిరుమల, తిరుపతిలలో భక్తులకు లాకర్లు కేటాయింపు, నిర్వహణకు నూతన సాఫ్ట్‌వేర్ రూపొందించినట్లు తెలిపారు. తిరుపతిలో వసతి కొరకు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని, రద్దు చేసుకున్న భక్తులకు కాషన్ డిపాజిట్లను వెంటనే చెల్లిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరో 10 రోజులలో తిరుమలలో కూడా కాషన్ డిపాజిట్లను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరుమల ఎస్వీ మ్యూజియంను మరింత ఆకర్షణీయంగా రూపొందించడంలో భాగంగా శ్రీవారి ఆలయానికి సంబంధించిన 3 డి ఇమేజింగ్‌ను సెప్టెంబరు 30వ తేదీకి భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మ్యూజియం మొదటి అంతస్తులో దాతల సహకారంతో శ్రీవారి ఆభరణాలు 3 డి డిజైన్‌తో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మ్యూజియంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే 3 డి వ్యవస్థ యొక్క ప్రోమో సమర్పించవలసిందిగా దాతలను కోరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో టిటిడి సిఇ శ్రీ రామచంద్రరెడ్డి, అదనపు సివిఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, రవాణా విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
25వ తేదీ లోపల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి
Related tags :