కప్‌కేక్‌లు తినడానికి సౌకర్యంగా ఉంటాయి. చూడ్డానికీ బాగుంటాయి. కేకుల్లో ఎన్ని మార్పులొచ్చినా కొత్త డిజైన్లు పాత వెరైటీలను పక్కకు తోసినా కప్‌కేకుల స్థానం మాత్రం పదిలంగానే ఉందంటే కారణం అదే. కానీ కేక్స్‌కిల్స్ వచ్చాక మాత్రం ఆ కథంతా మారిపోయింది. పుల్లైసుల్లా ఉండే వీటిని చూస్తే ఎవరూ ఇవి కేకులనుకోరు. ఇక, రకరకాల కార్టూన్ క్యారెక్టర్లూ జంతువులూ కీటకాల బొమ్మల రూపంలో ఐసింగ్ చెయ్యడం వల్ల ఈ కేక్స్‌కిల్స్ పిల్లలకు హాట్‌ఫేవరెట్లు అయిపోయాయి. ఇంకేముందీ, పుట్టినరోజు వేడుకల్లో పుల్లైస్ కేకులు ప్రత్యేక ఆకర్షణగా మారిపోయాయి. మామూలుగా కేక్ కటింగ్ తర్వాత కేకు ముక్కల్ని పిల్లలకిస్తే తినేటపుడు చేతినిండా బట్టలనిండా పూసుకుంటుంటారు. అదే ఐస్‌లాంటి ఈ కేకుల్ని అయితే వాటికున్న పుల్లను పట్టుకుని ఎంచక్కా తినేయొచ్చు. పిల్లలకే కాదండోయ్ ఈ కేక్స్‌కిల్స్‌ని చూసి పెద్దలూ ఫిదా అయిపోతున్నారు. వారికోసం కాస్త సాదా డిజైన్లతో పాటు, రంగు రంగుల్లో పంచదార పువ్వులూ పూసలూ ఎండు పువ్వుల్ని అద్ది ఐసింగ్ చేసినవి వస్తున్నాయి. అలా కాదంటే మనక్కావల్సిన డిజైన్‌ని చెప్పి చేయించుకోవచ్చు. హైదరాబాద్‌తో పాటు, బెంగళూరు, దిల్లీలాంటి ప్రధాన నగరాలన్నిటిలోనూ పెద్దస్థాయి బేకరీల్లో ఇవి దొరుకుతున్నాయి. మామూలు కేకుని తయారుచేసిన తర్వాత దాన్ని పొడిగా చేసి అందులో బటర్ క్రీమ్ కలిపితే ఉండ చుట్టేందుకు వీలుగా మెత్తగా అవుతుంది. ఆ కేకు ముద్దల్ని చేత్తోనూ లేదా మౌల్డుల్లో పెట్టీ ఐసు ఆకారంలోకి వచ్చేలా చేస్తారు. వాటిలోకి ఐసు పుల్లల్ని గుచ్చి తడిని పీల్చే పార్చ్‌మెంట్ కాగితం మీద పెడతారు. తర్వాత ఫ్రీజర్‌లో పెట్టి గట్టిపడే వరకూ ఉంచుతారు. ఆ కేక్ పాప్స్‌కిల్స్‌ని కావల్సిన రంగు చాక్లెట్ సిరప్‌లో ముంచి తీసి తినే గ్లిటర్స్ లేదా పంచదార బొమ్మలూ అంటించి మళ్లీ ఫ్రీజర్‌లో పెడితే గట్టిపడిపోయి ఐసులా అయిపోతాయి. సృజన పాళ్లు కాస్త ఎక్కువ ఉన్న షెఫ్‌లు వీటిని మరింత భిన్నమైన రూపాల్లో కూడా చేస్తుంటారు. పుల్లైసుల్ని ఇష్టపడని పిల్లలుండరేమో. కేకులన్నా చిన్నారులు ఎగిరి గంతేస్తారు. అందుకేనేమో పుల్లైస్ రూపమూ కేకు రుచీ కలగలిసి వచ్చిన ఈ కేక్స్‌కిల్స్ వాళ్లకి నచ్చేస్తున్నాయి.
ఇది కేకా? ఐసా?
Related tags :