ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు చైనా ఓపెన్ కలిసిరాలేదు. టోర్నీ నుంచి ఆమె త్వరగా నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో థాయ్‌ల్యాండ్ షట్లర్ పోర్న్‌పవీ చోచువాంగ్ చేతిలో 12-21, 21-13, 21-19 తేడాతో ఓటమి పాలైంది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో గెలుపుకోసం సింధు తీవ్రంగా శ్రమించింది. తొలిగేమ్‌ను సింధు దూకుడుగా ఆరంభించింది. 7-1తో దూసుకుపోయింది. విరామ సమయానికి ప్రత్యర్థి పుంజుకొని అంతరాన్ని 10-11కు తగ్గించింది. ఆ తర్వాత సింధు కసిగా ఆడి వరుసగా 8 పాయింట్లతో 19-10తో ఆధిక్యంలో నిలిచింది. సులువుగా గేమ్ గెలిచింది. రెండో గేమ్‌లో మాత్రం పోర్న్‌పవీ విజృంభించి ఆడింది. 9-7 నుంచి 15-7కు దూసుకెళ్లి రెండో గేమ్ కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మొదట ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు ఆడారు. 6-6తో సమంగా నిలిచారు. సింధు విజృంభించి 11-7తో ఆధిక్యంలో నిలిచింది. ఐతే పోర్న్‌పవీ పుంజుకొని ఆధిక్యాన్ని 15-19కి అంతరం తగ్గించింది. వరుస పాయింట్లతో చెలరేగి సింధుకు షాకిచ్చింది. పురుషుల సింగిల్స్‌లో బీ సాయిప్రణీత్ 21-19, 21-19 తేడాతో గ్వాంగ్ జు (చైనా)పై పోరాడి ఓడాడు. డబుల్స్ స్పెషలిస్టు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌కు పురుషులు, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ చుక్కెదురైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ 19-21, 8-21 తేడాతో జపాన్ ద్వయం టకేషి కమురా, కీగో సొనొండ చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సాత్విక్ జంటను 11-21, 21-16, 12-21 తేడాతో యుకి కనెకో, మిసాకి మట్సుటుమో జోడీ ఓడించింది.
చైనా ఒపెన్ నుండి ఇంటికొచ్చేసిన సింధు
Related tags :