ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. 13 పేజీల నివేదికను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అందజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దుర్వినియోగంపై నివేదికలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని చంద్రబాబు ఆరోపించారు. పోలీసుశాఖలో డీజీపీ నుండి కింది స్థాయి వరకు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. తమ పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు ఇలాంటి పరిణామాలే ఉసిగొల్పాయని ఫిర్యాదులో చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కోడెలపై 18 కేసులు అక్రమంగా పెట్టారని ఆరోపించారు. తమ పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, నన్నపనేని రాజకుమారితో పాటు పలువురిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. వైకాపా అరాచకాలపై డీజీపీకి రెండు పుస్తకాలు అందచేసినా ఫలితం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. గవర్నర్ అయినా చొరవ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తిచేశారు.
ప్రజాస్వామ్యాన్ని భయపెడుతున్న వైకాపా
Related tags :