Kids

అన్నదానం మహోన్నతం-పిల్లల కథ

Food Donation Importance Story For Kids | TNILIVE Kids Telugu News

అన్నపూర్ణ ఒక గృహిణి. కొంత ఆవేశం ఎక్కువ. కాని చాలా మంచిది.ఆమె మీద వాళ్ల అమ్మమ్మ ప్రభావం ఎక్కువ.

“ప్రతి రోజూ కొంత అదనంగా వండి ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి పెట్టాలి ” అని వాళ్ల అమ్మమ్మ చెప్పే మాటలను అన్నపూర్ణ శ్రద్ధగా పాటించేది.

అన్నపూర్ణ ప్రతి రోజూ కుటుంబానికి సరిపోయే రొట్టెలనే కాక అదనంగా మరో రెండు రొట్టెలను చేసి ఉంచేది.

వాళ్లింటికి ప్రతి రోజూ ఒక ముసలి మరుగుజ్జు వాడు వచ్చేవాడు. అతని నడుక గాలిలో నడుస్తున్నట్లుగా ఉండేది.మొదట్లో అన్నపూర్ణ అతన్ని చూసి భయపడేది కాని తరువాత అలవాటైపోయింది ఆమెకు. ఆ రెండు రోట్టెలను అతనికి ఇచ్చేది.

అతడు ఆ రొట్టెలను తీసుకుని ..

“నీవు చేసిన చెడు నీతోనే ఉండు.
మంచి మాత్రం తిరిగి వచ్చు !”

అని పాడుకుంటూ వెళ్లి పోయేవాడు. వేగంగా పాడడం వల్ల అదేమి అన్నపూర్ణకు అర్థం అయ్యేది కాదు.

ఇలా ప్రతి రోజూ జరిగేది.

ఒక రోజు అతను ఏమంటున్నాడో వినాలనుకుని రెండు రొట్టెలను ఇస్తూ శ్రద్ధగా విన్నది.ఆమెకు చాలా కోపం వచ్చింది.

“ఇన్ని రోజులు వాడేదో వాడి భాషలో కృతజ్ఞతలు చెబుతున్నాడనుకుంది.కాని, వాడు తిడుతున్నాడు. ఎవరైనా చెడు తొలిగిపోవాలని దీవిస్తారు. వీడేంది? నా చెడు నాతోనే ఉంటుందంటాడు. ”

ఇప్పటికే దాదాపు ఆరు సంవత్సరాల నుండి వస్తున్నాడు.ఎలాగైనా వీడిని వదిలించుకోవాలని మరునాడు ఆవేశంతో అతనికి ఇచ్చే రెండు రొట్టెలలో ” పురుగుల మందు ” కలిపింది.

ఆ రొట్టెలను అతని కోసం సిద్ధంగా ఉంచే పాత్రలో పెడుతున్నపుడు ఆమె చేతులు వణికాయి.
“చీ! నేను చేస్తున్న పనేంటి?” అని, ఆమెపై ఆమెకే అసహ్యం వేసి ఆ రొట్టెలను పొయ్యి లోకి విసిరి, కొత్తగా రెండు మంచి రోట్టెలను చేసి సిద్ధంగా ఉంచింది.

ఎప్పటి మాదిరిగానే ఆ ముసలి మరుగుజ్జు వచ్చాడు. రెండు రొట్టెలను ఆతనికి ఇచ్చింది.అవి తీసుకుని…

“నీవు చేసిన చెడు నీతోనే ఉండు.
మంచి మాత్రం తిరిగి వచ్చు !”

అని పాడుకుంటూ వెళ్లిపోయాడు.

అన్నపూర్ణ తన పనిలో లీనమైంది.
సాయంత్రమైంది. ఆమె మనసు సరిగ్గా లేదు. ఏదో తెలియని భయం, దడ దడ గా అనిపిస్తుంది.
“చీ! ఇవ్వాళ్లటి రోజే సరిగ్గా లేదు.
ప్రొద్దుననగా తిని వెళ్లిన కొడుకు ఇంకా తిరిగి రాలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు.ఆమె మనసు కీడును శంకించి ” తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని “దేవుడిని ప్రార్థించసాగింది.

ఒక గంట తరువాత తలుపు వద్ద చప్పుడైతే ఆదుర్దాగా వెళ్లింది. ఎదురుగా చిరిగి, దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో కొడుకు.

వాడు వస్తూనే తల్లిని కావలించుకుని ” అమ్మా ! ఈ రోజు ఒక అద్భుతం జరిగింది.
ప్రొద్దున నేను రొట్టెలు తిని వెళ్లానా ! కొంతసేపటి తరువాత ఏం జరిగిందో తెలియదు కాని, తల తిరగడం ప్రారంభమైంది. క్రింద పడిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో కూడా తెలియదు. అరుద్దామంటే నోరు పెగలడం లేదు.చచ్చిపోయాననే అనుకున్నాను.
అప్పుడోచ్చాడు ఒక ముసలి మరుగుజ్జు తాత. అతన్ని నేనెప్పుడూ చూడలేదు. వస్తూనే నా నోట్లో ఏదో పసరు పిండి బాగా నీళ్లు తాగించాడు. తరువాత వాంతి చేసుకున్నాను. మళ్లి ఏదో పసరు పిండాడు. తినడానికి రెండు రోట్టెలు ఇచ్చాడు. “అమ్మా ! అవి నువ్వు చేసే రోట్టెలు లాగా చాలా మధురంగా ఉన్నాయమ్మా !” అన్నాడు.

వింటున్న అన్నపూర్ణ తల గిర్రున తిరిగి పోయింది. ఆసరాగా గోడను పట్టుకుంది.వణుకుతున్న శరీరంతో వెళ్లి మందు కలిపిన రొట్టెలు విసిరిన వద్దకు వెళ్లి చూసింది. అవక్కడ లేవు.
వాటినే తన కొడుకు తిని వెళ్లాడా??? ఏమీ అర్థం కాలేదు!

ఎప్పుడు తెల్లవారుతుందా! ఎప్పుడు ఆ మరుగుజ్జు తాతను కలిసి మాట్లాడుదామా ! అని ఎదురు చూడసాగింది.
మరుసటి రోజు రొట్టెలతో పాటు ఇంకా ఇతర రుచికర పదార్థాలను వండి అతని కోసం ఎదురు చూడసాగింది. అతను రావలసిన సమయమైంది.

కాని అతను రాలేదు.
అతని బదులుగా ఒక చిన్న పిల్లవాడు వచ్చి “ఒక మరుగుజ్జు తాత ఈ ఉత్తరాన్ని నీకు ఇమ్మన్నాడు. ” అని ఇచ్చేసి వెళ్లిపోయాడు.

అందులో ఇలా ఉంది.

“తల్లీ ! నువ్వు మీ అమ్మమ్మ ఇంట్లో పురుడు పోసుకున్నావు. అప్పుడు మీ అమ్మమ్మ ,నీ కొడుకు జాతకాన్ని నాకు చూపించింది.
నేను చూసి వీడికి 12 సం॥వయస్సులో పెద్ద ప్రాణగండం ఉందని చెప్పాను. నా మునిమనవడిని ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి అని నా దగ్గర మాట తీసుకుంది .
నిజానికి నేను చేసింది ఏమీ లేదు. నువ్వు ఆరు సంవత్సరాలుగా చేసిన అన్నదానం నీ కొడుక్కి అరవై సంవత్సరాల ఆయుస్సును పోసింది.
ఇక నా అవసరం నీకు, నీ అవసరం నాకు లేదు తల్లి! ”

….ఉత్తరాన్ని చదవడం ముగించింది అన్నపూర్ణ.

ఇంకా ఆమె మనస్సులో…

“నీవు చేసిన చెడు నీతోనే ఉండు.
మంచి మాత్రం తిరిగి వచ్చు !”

….అనే మరుగుజ్జు తాత పాట ప్రతిధ్వనిస్తూ వుంది.