కష్టపడి సంపాదించిన ప్రజల సొమ్ముని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై ఆమె వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు నెలల్లో ఎల్‌ఐసీ రూ.57వేల కోట్ల సొమ్ము నష్టపోయిందన్న వార్తల ఆధారంగా గురువారం మరోసారి ప్రభుత్వం మీద ఆమె విరుచుకుపడ్డారు. ‘‘ఎల్ఐసీ నమ్మకానికి మారుపేరుగా ఉండేది. సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ముని భవిష్యత్తు భద్రత కోసం ఎల్‌ఐసీలో మదుపుచేస్తారు. ఈ మొత్తాన్ని నష్టాల్లో మునిగిన కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో పెట్టి ప్రజల విశ్వాసాన్ని భాజపా ప్రభుత్వం వమ్ము చేస్తోంది. ఇలాంటి నష్టదాయక విధానాలు అవలంబించడం ఏమిటి?’’ అని ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రియాంక ప్రశ్నించారు. ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసిందన్న ఆర్బీఐ నివేదికను ఉటంకిస్తూ ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వీటి ఆధారంగానే తాజాగా ప్రియాంక స్పందించారు.
LIC డబ్బులు ఎవరిని అడిగి మళ్లించారు?
Related tags :