WorldWonders

బ్లడ్ బ్లూ అయింది భయ్యా!

Womens Blood Becomes Blue With Anesthetics | TNILIVE WorldWonders

పంటి నొప్పి నివారణ కోసం తీసుకున్న మందుతో ఓ మహిళకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. తెల్లారేసరికి ఆమె రక్తం ఉన్నట్టుండి నీలం (నేవీ బ్లూ) రంగులోకి మారింది. ఆందోళనకు గురైన ఆమె వెంటనే ఆస్పత్రికి పరుగులు తీసింది. తాను బలహీనంగా ఉన్నానని, నీలం రంగులోకి మారిపోయానని వైద్యుడికి వివరించింది. అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గోళ్లు, చర్మం నీలం రంగులోకి మారిన వారిని వైద్య పరిభాషలో సైనోటిక్‌ అంటారని ఆమెను పరీక్షించిన వైద్యుడు ఓటిస్‌ వారెన్‌ అన్నారు. మెథిమోగ్లోబినీమియా వల్ల ఇలా జరుగుతుందన్నారు. రక్తంలో అధిక స్థాయుల్లో మెథిమోగ్లోబిన్‌ (హెమోగ్లోబిన్‌లో ఒక రకం) ఉత్పత్తి అయినప్పుడు ఈ లోపం తలెత్తుతుంది. అంటే హిమోగ్లోబిన్‌ ప్రాణవాయువును తీసుకెళ్లినా కణజాలాల్లోకి ప్రభావవంతంగా విడుదల చేయలేదు. అందుకే చర్మం, రక్తం నీలం రంగులోకి మారుతుంది. గతంలోనూ ఇలాంటి కేసును చూశానని వారెన్‌ తెలిపారు. ‘ఆమె చర్మం రంగు అచ్చం ఇలాగే ఉంది. ఒక్కసారి దానిని చూస్తే మర్చిపోలేరు. యాంటీ బయాటిక్స్‌తో ఆమెకు నయం చేశాం’ అని ఆయన వెల్లడించారు. నొప్పి నివారణ మందులోని బెంజోకైన్‌ వల్ల మెథిమోగ్లోబినీమియా వస్తుందని వారెన్‌ తెలిపారు. స్పర్శ కోల్పోయే గుణం దీనికి ఉంటుంది. అయితే ఆ మందును తాను పూర్తిగా వినియోగించలేదని ఆ మహిళ వెల్లడించగా ఎక్కువగానే వాడారని వైద్యుడు తెలిపారు.. మిథిలిన్‌ బ్లూ అనే యాంటిడాట్‌తో ఆమెకు చికిత్స చేశారు. నిమిషాల్లోనే తనకు కొంత ఉపశమనం కలిగిందని ఆ మహిళ వివరించింది. ఆ తర్వాత ఆమెకు రెండో డోసు ఇచ్చారు. పరిశీలన కోసం ఒక రాత్రంతా ఆస్పత్రిలోనే ఉంచి ఉదయం పంపించారు. వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. నొప్పి నివారణ మందులు, బెంజోకైన్‌ ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్‌ వారెన్‌ హెచ్చరించారు. ఏమీ తెలియకుండా దానిని ఉపయోగిస్తే అత్యంత ప్రమాదకర దుష్పరిణామాలు ఉంటాయని వెల్లడించారు.