ప్రతి క్రీడాకారుడు తప్పించుకోలేని దశ ఒకటుంటుంది. అదే ప్రాణంగా ప్రేమించిన ఆటకు వీడ్కోలు పలకడం. ఇన్నాళ్లూ తనకన్నీ ఇచ్చిన ఆటను వదిలేయడం అంత తేలికేమీ కాదు. ఎంతో బాధ ఉంటుంది. ‘నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము’ అని అన్నమయ్య చెప్పినట్టు చివరికి ప్రతి ఒక్కరూ ‘ఆట’కు వీడ్కోలు పలకాల్సిందే. అద్భుతమైన ఆటగాళ్లతో నిండిన భారత క్రికెట్ రంగంలో కొందరు స్టార్లు మాత్రం దీనిని ఎందుకో అర్థం చేసుకోలేకపోతున్నారు. దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ తరహాలో అందంగా, ఘనంగా వీడ్కోలు పలికే కళ అందరికీ అబ్బదని చాలామంది అభిప్రాయం. 1987లో పాక్‌పై చిన్నస్వామిలో సన్నీ చివరి టెస్టు ఆడాడు. టర్నింగ్, బౌన్సీ పిచ్‌పై దాయాది బౌలర్లను ఎదుర్కొని 96 పరుగులు చేశాడు. అప్పుడతని వయసు 37. తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. మరో రెండేళ్లు ఆడగలడు. రిటైర్మెంట్ పలికి అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఇంకొన్ని రోజులు ఆడుంటే బాగుండేది అనిపించుకున్నాడు. ధోనీ పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు!! ప్రస్తుతం ధోనీ వయసు 38. రెండు నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. నవంబర్ వరకు అందుబాటులో ఉండడు! బంగ్లాదేశ్ సిరీస్‌కూ దూరమే. ఇప్పటికే సీనియర్, భారత్-ఏ జట్ల కోసం 45 రోజుల దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూలు, శిక్షణ, డోపింగ్ నిరోధ పరీక్షల ప్రణాళికలను బీసీసీఐ సిద్ధం చేసింది. ఇందులో ఎక్కడా ధోనీ పేరు లేదని సమాచారం. అంటే అతడు ఝార్ఖండ్ తరఫున విజయ్ హాజరే సైతం ఆడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి పరిస్థితి, ఆలోచనలు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ‘ఎవరూ పంపించకుండానే అతడు వెళ్లిపోతాడని అనుకుంటున్నా. ధోనీకి ఆవల ఆలోచించాలి. అతడు కనీసం నా జట్టులోనూ లేడు’ అని గావస్కర్ చెప్పారంటేనే మహీ భవితవ్యం త్రిశంకు స్వర్గంలో ఉందని అర్థం.
ధోనీకి కూడా సెహ్వాగ్ గతి పట్టిస్తారు
Related tags :