Politics

జగన్-కేసీఆర్ భేటీ

Jagan-KCR Meets At Pragati Bhavan

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. లోటస్‌ పాండ్‌ నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్‌ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కేసీఆర్‌ను జగన్‌ ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రికను కేసీఆర్‌కు ఆయన అందించారు. ఈ భేటీలో రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలతో పాటు గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగంపై సీఎంలు చర్చించనున్నారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలపై చర్చలు జరపనున్నారు. మాంద్యం నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వీరిద్దరూ చర్చించనున్నట్లు తెలిసింది. ఇద్దరు సీఎంల మధ్య తొలిసారిగా గత జూన్‌ 28న ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు రెండో తేదీన ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.