– భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రధానంగా వ్యవసాయాధారితమైంది. దేశంలో 60శాతం ప్రజలు ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. గతంలో ప్రభుత్వాలు వ్యవసాయంపై దృష్టిపెట్టినా కోట్లాదిమంది వ్యవసాయదారులు పేదరికం, సౌకర్యాల లేమితో సతమతం అవుతూనే ఉన్నా రు. గ్రామీణ సాంఘిక మౌళిక సౌకర్యాల అభివృద్ధిని సరైన విద్యా, వైద్య సదుపాయాలతో బలోపేతం చేయవలసి ఉంది. దేశంలో వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి సరైన మార్గంలో దృష్టిపెట్టారు.
– 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాని కలను సాకారం చేసే దిశగా ఆర్థిక వ్యవసాయదారులు తక్కువ పెట్టుబడితో అధికాదాయం పొందేలా చేయటంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. అందుకోసం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాల్సి ఉంటుంది. గ్రామాల కొనుగోలుశక్తి పెరిగినప్పుడు మాత్రమే గ్రామీణ పారిశ్రామికోత్పత్తి వృద్ధిబాటపట్టి జీడీపీ అధికమవుతుంది.
– వ్యవసాయంతోపాటు అనుబంధరంగాలకు నూతనోత్తేజం తీసుకురావడం ద్వారా గ్రామాలను బాగుచేయవచ్చని కేంద్రం గ్రహించింది. తదనుగుణంగా 2017-18 నుంచి 2028-29 వరకు గ్రామీణ అభివృద్ధి నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే కాకుండా వయవసాయ మార్కెట్ల అనుసంధానాన్ని కూడా బలోపేతం చేయాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని కల్పించటం, గ్రామాల్లో మౌళిక వసతులు పెంచటంద్వారా వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధికి పుష్టి కలుగుతుంది.
– పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అవుతుంది. ఈ నినాదానికి కేంద్ర బడ్జెట్ నిర్ణయాలు మద్దతు ఇచ్చాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ప్రాధాన్యాంశాలుగా నిలిచాయి. దీంతో రైతుల ఆదాయం రెట్టింపై, పెట్టుబడులకు ప్రోత్సా హం కలుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధర- సరఫరాల్లోని వ్యత్యాసాలను తొలగించి అందరికి అందుబాటులోకి తేవటానికి ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని ప్రకటించారు.
– దీర్ఘ కాలంలో ఆర్థిక వ్యవస్థ విస్తరణకు భారీ పెట్టుబడులు కేటాయించి శాస్త్రసాంకేతిక విజ్ఞానాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయ ఉత్పాదన కీలకమైన నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, భారీ పరిశ్రమలు, విద్య, వైద్యరంగాల అభివృద్ధికి కృషి చేశారు. ఐసీఏఆర్ వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ, అభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మేలురకం విత్తనాలు, పంటల సంరక్షణ, పంటల దిగుబడి పెంచటానికి రసాయన ఎరువులు వాడకం, నూతన ఉత్పాదనలపై పరిశోధనలు చేపట్టారు. వీటి సమాంతర కేంద్రాలుగా సమాచార బదిలీకి అవకాశం కల్పించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే కొత్త యోచనలు బలంగా ఉన్నాయి. 62శాతం జనావళికి జీవికగా ఉన్న సేద్యరంగాన్ని శాస్త్రసాంకేతికతలనే జోడెడ్లతో బడుగు రైతులకు లాభాల భరోసా ఇచ్చేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సాగిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక శిఖరాగ్ర సదస్సు స్ఫూర్తిమంతంగా ముగిసింది. ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవాలనే ఆలోచనలకు అద్దంపట్టింది. రైతులకు అవసరమైన సమాచారం అంతా వారి ఇంటివద్దకే చేర్చాలన్న ధోరణికి కేంద్ర ప్రభుత్వం మద్దతు పలికింది.
– చిన్నచిన్న కమతాల రైతులను బృందాలుగా ఏర్పాటుచేసి వేల ఎకరాల్లో సమాజిక సాగును ప్రోత్సహిస్తే ఖర్చు గణనీయంగా తగ్గి రైతులకు భారీగా లాభాలు చేకూరుతాయి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ఆవిష్కరణల వినియోగ అవసరాన్ని ప్రస్తావిస్తూనే, మేలిమి విత్తనాల ప్రాధాన్యాన్ని ప్రపంచ సాంకేతిక దిగ్గజం బిల్‌గేట్స్ సూటిగా ప్రశ్నించారు. థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల్లో అధిక ఉత్పాదకత సాధ్యపడుతుందని, డీఎన్‌ఎ పరిజ్ఞానం అనుసంధానాన్ని సమ్మిళిత సమీకృత వ్యవసాయం ద్వారా ఆర్థిక ప్రగతి సాధించటానికి అవకాశం ఉన్నదని ఆయా దేశాలు నొక్కిచెప్పాయి.
– వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటిరంగాలకు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. రైతు కుటుంబాల ఆదాయంపై దేశంలో ఆంధ్రప్రదేశ్ 21వ స్థానంలో ఉన్నదన్న వాస్తవాన్ని గుర్తించి అన్నదాతల రాబడి పెంపుదలకు సాంకేతిక పరిష్కారాన్ని వేగవంతంగా అన్వేషిస్తున్నది. సేద్యంలో సౌలభ్యాన్ని శాస్త్రీయతను పెంచేలా రైతులకు బాసటగా 259 కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు విశాఖ సదస్సు వేదికైంది.
– భారతదేశం పాల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పాలడైరీ మౌళిక సదుపాయాల కోసం నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. ఆపరేషన్ ఫ్లడ్ పథకం కింద రూ.10,881 కోట్లతో పాల ఉత్పత్తులకు కావాల్సిన మౌళిక సదుపాయాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిధిని ఖర్చు చేసి కొత్త పాలశుద్ధి కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తామని తెలిపింది.
– ఇటీవల ఐరోపా సమాఖ్య వ్యవసాయ దృక్పథం 2019 పేరుతో విడుదల చేసిన నివేదికలో 2030 నాటికి సార్క్, ఉత్తర ఆఫ్రికా, చైనా, మధ్యప్రాచ్య దేశాలు ఏటా నాలుగు కోట్ల టన్నుల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే స్థాయికి చేరుతాయని అంచనా వేసింది. ఈ పరిణామం భారత రైతుల ఆదాయం పెంచటానికి ఒక మంచి అవకాశంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి.
– గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలన్నింటిని జీవనోపాధి అభివృద్ధి, వైవిద్యీకరణతో అనుసంధానం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన్నికైన ఆస్తులు, నీటి సంరక్షణపై దృష్టి సారించి వ్యవసాయ చెరువులు, తవ్విన బావులు, బర్రెలు, మేకలు తదితర పశుశాలలలు, కోళ్ల షెడ్లు, గృహనిర్మాణం వంటి జీవనోపాధి కల్పించే వ్యక్తిగత ప్రయోజనాలకు కూడా సహకారం అందించింది. ఈ విధంగా గ్రామీణాభివృద్ధిలో జీవనోపాధి కల్పించే వ్యవసాయం, దాని అనుబంధ పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమకు సబ్సిడీ కార్యక్రమాలతో అనుసంధానం చేయటం వల్ల మెరుగైన ఆదాయానికి దోహదం చేస్తాయి.
– పండ్లు, కూరగాయల ఉత్పత్తుల పెరుగుదల, పాడి, కోళ్ల పరిశ్రమ వంటి వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల ద్వారా గత నాలుగేండ్లుగా గ్రామీణ జీవనోపాధి వైవిధ్యతపై దృష్టి సారించటం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, పేదల ఆదాయం వృద్ధికి కారణమైంది.
వ్యవసాయ గిట్టుబాటు ధరలతోనే గ్రామీణాభివృద్ధి

Related tags :