ప్రవాస భారతీయుల(ఎన్‌ఆర్‌ఐ)కు శుభవార్త. భారత ప్రభుత్వం జారీచేసే విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగిన (ఆధార్ కార్డు) కార్డు పొందాలంటే ఇకపై వారు వేచి చూడనక్కర్లేదు. ప్రవాస భారతీయులకు ఆధార్ కార్డు జారీ చేసే అంశాన్ని కేంద్రం సులభతరం చేసింది. దీంతో ఇక నుంచి పాస్‌పోర్టు కల్గిన ఎన్నారైలు ఎవరైనా స్వదేశానికి వచ్చినప్పుడు నేరుగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు పొందేందుకు 182 రోజుల పాటు వేచి చూడాలంటూ గతంలో ఉన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కేంద్రం ఆదేశాలకనుగుణంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నారైలు స్వదేశానికి వచ్చిన తర్వాత లేదా ముందస్తు అనుమతితో బయో మెట్రిక్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యూఐడీఏఐ సంస్థ సర్క్యులర్‌లో తెలిపింది. వారు తమ వెంట తీసుకొచ్చిన పాస్‌పోర్టునే గుర్తింపు కార్డుగా, చిరునామా, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంగా పరిగణిస్తామని స్పష్టంచేసింది. ఒకవేళ పాస్ పోర్టులో భారతదేశంలోని చిరునామా లేకపోతే.. ఆధార్ సంస్థ సూచించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. జులై 5న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నారైలకు ఆధార్ మంజూరు చేయడంలో నెలకొన్న జాప్యాన్ని తొలగించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
పాస్‌పోర్టు ఉంటే చాలు-ఎన్నారైలకు ఆధార్ ఇస్తారు

Related tags :