Movies

వెంటిలేటర్‌పై వేణుమాధవ్

Telugu Actor Venumadhav Condition Critical

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబసభ్యులు ఇటీవల సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో వేణుమాధవ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని వేణు మాధవ్‌ ప్రతినిధులు తెలిపారు. సినీ నటులు జీవిత-రాజశేఖర్‌లు ఆస్పత్రికి వచ్చి వేణు మాధవ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన వేణుమాధవ్‌… ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘సంప్రదాయం’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. అదే సమయంలో పవన్‌కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ చిత్రం వేణుమాధవ్‌కు ఎంతో గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక డిమాండ్‌ ఉన్న కమెడియన్లలో ఆయన ఒకరిగా నిలిచారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రంతో పరిచయమైన వేణుమాధవ్‌ మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ‘హంగామా’తో కథానాయకుడిగా మారారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని కథానాయకులందరితోనూ ఆయన నటించారు.