Food

పనసముక్కల మసాలా

Telugu Food Easy Short Fast Recipes | Jackfruit Masala - పనసముక్కల మసాలా

కావల్సినవి:
పనస ముక్కలు – రెండు కప్పులు, పసుపు – పావుచెంచా, చిన్న ఉల్లిపాయలు – పది, టొమాటో – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – పది, కారం – రెండు చెంచాలు, ఉప్పు – తగినంత, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, మినప్పప్పు, సోంపు, మిరియాలు – పావుచెంచా చొప్పున, కరివేపాకు రెబ్బలు – రెండుమూడు.

మసాలా కోసం:
తాజా కొబ్బరి తురుము – నాలుగు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర, సోంపు – పావుచెంచా చొప్పున, దాల్చిన చెక్క – చిన్నది.

తయారీ:
ఓ గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో పనస ముక్కలూ, పసుపూ, తగినంత ఉప్పూ వేసి పొయ్యిమీద పెట్టాలి. ఆ ముక్కలు మెత్తగా అయ్యాక దింపేయాలి. ఉల్లిపాయలూ, టొమాటో, వెల్లుల్లి రెబ్బల్ని ముక్కల్లా కోయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, మినప్పప్పూ, సోంపు, మిరియాలూ, కరివేపాకు రెబ్బలూ వేయించుకోవాలి. తరవాత అందులో ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లి ముక్కలు వేయించాలి. వాటిలో పచ్చివాసన పోయాక కారం, మరికొంచెం ఉప్పూ కలపాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక ఉడికించి పెట్టుకున్న పనసముక్కలు వేయాలి తడిపోయేలోగా మసాలాకోసం సిద్ధంగా పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ముద్దను పనసముక్కలపై వేసి బాగా కలపాలి. ఇది కూరలా తయారయ్యాక దింపేయాలి.