WorldWonders

ఢిల్లీ ఎమర్జన్సీ నెంబరు 112

Delhi Begins Emergency Services With 112 Number

అత్యవసర సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ నంబర్‌ 112ను ఢిల్లీ పోలీసులు బుధవారం అందుబాటులోకి తెచ్చారు. కాల్‌ చేసిన వ్యక్తి లోకేషన్‌ ట్రేస్‌ చేసి వారికి అతి త్వరగా సేవలను అందించనున్నారు. ఎవరైనా ఈ హెల్ప్‌లైన్‌ సేవలు వినియోగించుకోవాలంటే 112 నెంబరుకు డయల్‌ చేస్తే నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ లేదా జీపీఎస్‌ ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌కు కనెక్ట్‌ అవుతుంది. అక్కడ వారికి అవసరమయ్యే సేవలను అందిస్తారు. ఈ విషయం గురించి సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. ఈ కొత్త సేవలతో కంట్రోల్‌ రూమ్‌ కాస్తా కాల్‌ సెంటర్‌గా మారిందన్నారు. ఒకవేళ ప్రజలు తెలీకుండా 100, 101, 102 సేవలకు కాల్‌ చేసినప్పటికీ అంతిమంగా అది 112కు కనెక్ట్‌ అవుతుందని పేర్కొన్నారు. ‘డయల్‌ 112 అనేది ప్రజలకు వరంగా మారనుంది. ఇది కేవలం డబ్బు, సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యుత్తమ సేవలను అందించడానికి దోహదపడుతుంది’ అని స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముక్తేశ్‌ చంద్రా పేర్కొన్నారు. ప్రస్తుతం కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అంతేకాక కంట్రోల్‌ రూమ్‌ను శాలిమార్‌బాగ్‌లోని కొత్త భవనానికి బదిలీ చేయడమే కాక పూర్తిగా కాగితరహిత సేవలను మాత్రమే వినియోగించనున్నారు. ఒకే దేశం ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ అనే విధానం అమెరికాలోనూ అమల్లో ఉంది. అక్కడ అన్ని రకాల సేవలకుగానూ 911 అనే నంబర్‌నే వినియోగిస్తారు.