Health

టూత్‌పేస్ట్‌తో క్యాన్సర్ ప్రమాదం

Intestine Cancer Causing ToothPaste

పండ్లు తోముకునే టూత్‌పేస్టు కడుపులోకి పోతే ప్రమాదమంటున్నారు అమెరికా పరిశోధకులు. ఈ టూత్ పేస్టుతో పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. నిద్రముఖంతోనే బ్రష్ తీసుకుని, దానిపై పేస్టు వేసుకుని కళ్లు మూస్తూ తెరుస్తూ పండ్లు తోముకునే చిన్నారులను మనం చూస్తుంటాం. బ్రష్ చేసుకోమని టూత్‌పేస్టు వేస్తే పండ్లు తోమడం కన్నా ముందు దాన్ని మింగేస్తుంటారు పిల్లలు. కొందరు చిన్నారులు తియ్యగా ఉందని కూడా కావాలని తినేస్తుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి హాని లేదులే అనుకుంటాం. అయితే అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం నోట్లోకి వెళ్లిన టూత్‌పేస్టుతో హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. టూత్‌పేస్టు తినే అలవాటున్న చిన్నారులకు పెద్దయిన తర్వాత పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.టూత్‌పేస్ట్‌లో ట్రైక్లోసిన్ అనే పదార్థం బాక్టీరియాను చంపుతుంది. ఇది కడుపులోకి వెళ్లినప్పుడు పేగుల్లో ఉండే మనకు మేలుచేసే బాక్టీరియాను చంపేస్తుంది. దాంతో పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. ఎలుకలకు ట్రైక్లోసిన్ తినిపించి అధ్యయనం చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. ఎలుకల కడుపులోకి ట్రైక్లోసిన్ వెళ్లినప్పుడు వాటి జీర్ణవ్యవస్థకు అవసరమయ్యే బాక్టీరియా చనిపోయినట్టు తేలింది. టూత్‌పేస్టులతోపాటు సబ్బులు, లిక్విడ్ సోపుల్లో కూడా ఈ రసాయనం ఉంటుంది. పిల్లలు ఆడుకునే కొన్నిరకాల బొమ్మల్లో కూడా ఇది ఉంటుంది. అందుకే ఈ రసాయనం ఉన్న ఉత్పత్తుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు. అందుకే పిల్లల బ్రష్ నిండా టూత్‌పేస్టు పెట్టొద్దు. చాలా కొద్దిగా మాత్రమే పెట్టాలి. వాళ్లు టూత్‌పేస్టు తినకుండా ఓ కంట కనిపెట్టుకుని ఉండమని సూచిస్తున్నారు.