వాట్సప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫార్మ్స్ లో విచ్చలవిడిగా వస్తున్న మెస్సేజుల్లో ఏవి అసలైనవో, ఏవి నకిలీవో తెలియడంలేదని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశ సార్వభౌమత్వం, వ్యక్తుల ప్రైవసీని కాపాడేందుకు వీలుగా మూడు వారాల్లోగా గైడ్‌లైన్స్ తయారు చేయాలని కేంద్రాన్ని కోర్టు మంగళవారం ఆదేశించింది. ‘‘ ఫేక్ మెస్సేజ్‌లు ఎవరి దగ్గరి నుంచి వస్తున్నాయో గుర్తుపట్టాలి. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం, వ్యక్తుల ప్రైవసీలను కూడా కాపాడాలి. సుప్రీంకోర్టు గాని హైకోర్టుగాని దీన్ని నిర్ణయించలేవు. దీనిపై విధానం తీసుకోవాల్సింది ప్రభుత్వం మాత్రమే’’ అని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన బెంచ్ తెలిపింది. ఇదే సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ‘‘బేసిక్ మోడల్ మొబైల్ ఫోన్ల జమానా మళ్లీ వస్తే బాగుండు. టెక్నాలజీ వల్ల సౌకర్యం కంటే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయా అన్న అనుమానం కూడా వస్తోంది’’ అని బెంచ్ పేర్కొంది. ఆధార్‌తో సోషల్ మీడియా అకౌంట్లను లింక్చేసే విషయంలో గైడ్‌లైన్స్ రూపొందించే ఆలోచన ఉందా లేదా అన్నదానిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన మూడురోజుల తర్వాత సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి ఇలాంటి కామెంట్స్ చేసింది. ఇప్పుడు విచారణ జరుపుతున్న అంశం ఆధార్‌తో సోషల్ మీడియా అంకౌంట్లను లింక్ చేయడం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దండుదాడులు, హత్యల సంఘటలకు దారితీస్తున్న ఫేక్ న్యూస్‌ను పంపిస్తున్న వాళ్లను గుర్తించడంపైనే దృష్టిపెట్టినట్టు కోర్టు తెలిపింది.
సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సింది ప్రభుత్వమే
Related tags :