DailyDose

TNI Morning Flash News-09/26

TNI Morning Flash News-09/26

* క్రెడిట్ కార్డుతో పెట్రోల్ కొనుగోలు చేసే వాహనదారులకు చేదువార్త అందించాయి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు చెల్లింపులపై ఇస్తున్న 0.75 శాతం తగ్గింపును అక్టోబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే డెబిట్​, ఈ-వాలెట్​ల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్ కొనసాగుతుందని స్పష్టం చేశాయి.

* అమెరికాలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, వివిధ దేశాలకు చెందిన పలువురు ఉన్నత వ్యాపారవేత్తలతో న్యూయార్క్​లో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్​ను అవతరింపజేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యాపారవేత్తలకు వివరించారు మోదీ. ప్రస్తుతం భారత్​లో పెట్టుబడిదారులకు ఉన్న అవకాశాల గురించి చెప్పారు. ఈ సమావేశానికి ముందు బ్లూమ్​బర్గ్​ గ్లోబల్ బిజినెస్​ ఫోరమ్​లో పాల్గొన్నారు మోదీ. తాము చెప్పిన విషయాలను మోదీ జాగ్రత్తగా విన్నారని పలువురు వ్యాపారవేత్తలు తెలిపారు.

* విశాఖ-విజయవాడల మధ్య పూర్తి ఏసీ బోగీలతో నడిచే డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఇవాళ ఉదయం 11 గంటలకు రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ సి.అంగడి ప్రారంభించనున్నారు. ఉదయం 11.30 గంటలకు విశాఖలో బయలుదేరి.. సాయంత్రం 4.50 గంటలకు విజయవాడ చేరనుంది. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి.. రాత్రి పదకొండు గంటలకు విశాఖ చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.

* పాకిస్థాన్‌లోని ఖలిస్థాన్‌ ఉగ్రమూకలు సెప్టెంబర్‌ 9 నుంచి 16 వరకు డ్రోన్‌ల ద్వారా 80 కేజీల బరువుగల ఆయుధాలూ, మందుగుండు సామాగ్రిని సరిహద్దులగుండా భారత్‌లోనికి జారవిడిచినట్టు భారత భద్రతాదళాలూ, పంజాబ్‌ పోలీసులు ధృవీకరించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం పాకిస్తాన్‌ గూఢచారి వ్యవస్థ మద్దతుతో ఖలిస్థాన్‌ తీవ్రవాద శక్తులు ఈ చర్యకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన అమృత్‌సర్‌లోని తరన్‌ తరన్‌ జిల్లాలో డ్రోన్‌ల ద్వారా జారవిడిచిన ఆయుధసామగ్రిపై విచారణ జరపడంతో విషయంవెలుగులోకి వచ్చింది.

* ఉత్తర కోస్తా తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణాంధ్ర పరిసర ప్రాంతాల మీదుగా కర్ణాటక, రాయలసీమ, తెలంగాణపై ఆవరించి ఉందని తెలిపింది. 

* అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు నేడు హైదరాబాద్‌లోని మౌలాలిలో జరగనున్నాయి. మధ్యాహ్నం తర్వాత వేణు అంతిమ సంస్కారాలు జరిపేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉదయం వేణు భౌతికకాయాన్ని మౌలాలిలోని నివాసం నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్‌కు తరలించనున్నారు. అక్కడ నటీనటుల సంఘం వేణు మాధవ్‌కు కడపటి నివాళులు అర్పించనుంది. అనంతరం.. వేణు అంతిమయాత్ర మౌలాలికి చేరుకుంటుంది. అక్కడి శ్మశాన వాటికలో కుటుంబసభ్యులు దహన సంస్కారాలు జరిపించనున్నారు.

* ఇండోనేషియా దేశంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది.  సెంట్రల్ ఇండోనేషియా దేశం మాలుకు ప్రావిన్సు పరిధిలోని సీరం దీవుల్లో 29.9 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం రిక్టరు స్కేలుపై 6.5గా నమోదైంది. ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేదని అమెరికా జియాలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు. పసిపిక్ సముద్రం పరిధిలోని ఇండోనేషియాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల నుంచి లావా వెదజల్లటం చేస్తుంటాయి.

* ఇప్పటికే భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో పిడుగు వార్త, హికా తుపాను. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు సిద్ధమైంది. రాగల 24 గంటల్లో.. ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఈండ్ హెచ్చరించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హికా తుపాను ప్రభావంతో.. అరేబియా తీరంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులెవరూ.. చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. మరో…48 గంటల్లో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

* హనుమాన్ పేట పోలిస్ఆఫీసర్స్ క్వాటర్స్ లో ఛీ సూర్యనారాయణ సూసైడ్. 89బ్యాచ్ కు చెందిన సూర్యనారాయణ. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్న గవర్నర్ పేట పోలీసులు.

* నందికొట్కూరు ఒకరిపై ఒకరు దాడికి దిగిన వైసిపి వర్గీయులు. ఎమ్మెల్యే ఆర్థర్ అనుచరుడు ప్రాతకోట వెంకటరెడ్డి పై నియోజకవర్గ ఇంచార్జి సిధార్ధ రెడ్డి అనుచరుల దాడి. నందికొట్కూరు జీవనజ్యోతి స్కూల్ వద్ద కాపుకాచి దాడి …తీవ్ర గాయాలు…ఆసుపత్రికి తరలింపు. కొన్ని నెలలుగా ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ ఇంచార్జి సిధార్థ రెడ్డి వర్గాల మధ్య కొనసాగుతున్న వివాదం.

* తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని మీ సేవ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చారు. గురువారం నుంచి 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ ఏవీ నాగేశ్వర్‌రావు, సంస్థాగత కార్యదర్శి నూర్‌ మహమ్మద్‌లు బుధవారం ఒక ప్రకటన చేశారు. మీ సేవ కేంద్రాల్లో ఉద్యోగులు గత 15 ఏళ్లుగా అరకొర వేతనాలతో పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనం ఇవ్వాలని, మీ సేవ కేంద్రాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ సచివాలయంలో మీ సేవ ఉద్యోగులని విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు.