టాలీవుడ్ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 6న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరిన వేణుమాధవ్ కు కొద్దిరోజులుగా డయాలసిస్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. వేణుమాధవ్ మరణవార్త తెలుసుకున్న సినీ నటులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
వేణుమాధవ్ పుట్టింది పెరిగింది అప్పటి నల్గొండ జిల్లా కోదాడలో. అక్కడే డిగ్రీ వరకూ చదువుకున్నాడు. చిన్నతనం నుంచే మిమిక్రీ చేసేవాడు. స్టార్ హీరోలను అనుకరిస్తూ వారిలా డ్యాన్సులు కూడా చేసేవాడు. అలాగే కోదడా ప్రాంతంలో మొట్ట మొదటి వెంట్రిలాక్విస్ట్ గానూ అతనికి పేరుంది. అలా అనుకోకుండా అబ్బిన ఆ కళే అతన్ని కళారంగంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకుంది. ఆ కళతోనే ఎన్టీఆర్‌తో అనుబంధం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఉద్యోగం వచ్చేలా చేసింది.
ఎన్టీఆర్ ఆదేశంతో మకాం హైదరాబాద్ కు మారింది. ఇక్కడ కూడా కొన్ని బయటి ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉండేవాడు. ఓ సారి రవీంద్ర భారతిలో చేసిన మిమిక్రీ ప్రోగ్రామ్ ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి చూశారు. తర్వాత వేణు మాధవ్ కు పెద్దగా ఇష్టం లేకపోయినా అతనితో సంప్రదాయం సినిమాలో చిన్న వేషం వేయించారు. అతన్లో స్పార్క్ ఉండటం వల్ల చిన్న వేషమైనా ఆకట్టుకుంది. 1996లో సంప్రదాయం సినిమాతో అడుగుపెట్టిన వేణుకు అవకాశాలు వెంటనే రావడం విశేషం. గోకులంలో సీత, మాస్టర్, సుస్వాగతం సినిమాల్లో కనిపించాడు. కానీ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో పరిశ్రమలో తన ప్లేస్ ను పర్మనెంట్ చేసుకున్నాడు.
తొలిప్రేమ సినిమాతో వేణుమాధవ్ ఓవర్ నైట్ బిజీ అయిపోయాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ లో ఓ స్టూడెంట్ గానో లేదంటే ఏదైనా రౌడీ గ్యాంగ్ లో మెంబర్ గానో హల్‌చల్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్ గానే సందడి చేశాడు.
వేణుమాధవ్ వచ్చిన టైమ్ లో పరిశ్రమకు కొత్త కమెడియన్స్ చాలామంది వచ్చారు. అయినా అందర్లోనూ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా వేణు మిమిక్రీ ఆర్టిస్ట్ కావడంతో డైలాగ్స్ ను అలా చెప్పేవాడు. అలాగే మంచి ఎక్స్ ప్రెషన్స్ కూడా కలిసొచ్చాయి. దీంతో తక్కువ టైమ్ లోనే యంగ్ హీరోల సినిమాల్లో కాలేజ్ స్టూడెంట్ పాత్రలతో ఆకట్టుకున్నాడు. పైగా అప్పుడు కాలేజ్ లవ్ స్టోరీస్ ట్రెండ్ కావడంతో వేణుకు ఇంకా బాగా కలిసొచ్చింది. అలా ముదురు స్టూడెంట్‌గా దిల్ సినిమాలో వేణు పాత్ర పంచిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు.
నటుడుగా జన్మనిచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి వేణును హీరోగానూ చేశాడు. ఆల్రెడీ తను హీరోగా చేసిన అలీతో కలిపి హంగామా సినిమాలో వేణుమాధవ్ ను హీరోగా చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత భూ కైలాష్ అనే సినిమాలో సోలో హీరోగా ఆకట్టుకున్నాడు. సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. అతను మాత్రం నిర్మాతగా మారి ప్రేమాభిషేకం చిత్రాన్ని నిర్మించి హీరోగా నటించాడు. బట్ ఈ మూవీ ఫ్లాప్ కావడంతో మళ్లీ నిర్మాణం వైపు వెళ్లలేదు.
సంప్రదాయం సినిమాతో వచ్చి సంప్రదాయ హాస్యంతో పాటు తనదైన మేనరిజమ్స్ ను సెట్ చేసుకున్నాడు వేణు మాధవ్. 2013, 2014 వరకూ దాదాపు వేణు మాధవ్ లేని సినిమా లేదు. కాకపోతే చివరికి వచ్చేసరికి సినిమాలు తగ్గాయి. కొత్తవాళ్లు రావడం ఓ కారణమైతే తన రేంజ్ కు తగ్గ పాత్రలు రావడం లేదు.. పైగా డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పమంటున్నారు.. అందుకే సినిమాలు చేయడం లేదు అని చెప్పుకునేవాడు వేణు మాధవ్. ఏమైతేనేం.. ఓ నాలుగైదేళ్లుగా దాదాపు సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.
కొన్నాళ్లుగా లివర్ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు వేణుమాధవ్. ఇదే టైమ్ లో కిడ్నీలు కూడా చెడిపోయాయి. ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్ లో చేర్పించారు. కోలుకుంటాడు అనుకున్నారు చాలామంది.. కానీ అతను ప్రేక్షకులను ఎన్నో నవ్వుల్ని.. కుటుంబానికి శోకాన్ని మిగిల్చి మరలిరాని లోకాలకు తరలిపోయారు.
కళాకారుడికి మరణం లేదు. భౌతికంగా దూరమైనా.. తన ప్రతిభతో ప్రేక్షకులకు చేరువగానే ఉంటారు. మరణం మనం కోరుకున్నప్పుడు రాదు. ఇప్పుడు వేణుమాధవ్ కు కూడా అంతే. ఎప్పుడు కనిపించినా తనదైన శైలిలో నవ్విస్తూ.. త్వరలోనే మళ్లీ నటిస్తానని చెప్పే వేణుమాధవ్.. ఆ మాటలను అబద్ధం చేస్తూ వెళ్లిపోయాడు. వెండితెరపై ఎన్ని నవ్వుల్ని పంచినా.. జీవన తెరపై దుఖాన్ని కలిగించే తన చివరి సీన్ పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు వేణుమాధవ్.