DailyDose

కృష్ణాలో ఇద్దరు ఎస్‌ఐలు ఒక కానిస్టేబుల్ సస్పెన్షన్:నేరవార్తలు-09/25

Two SIs & One Constable Suspended - Telugu Crime News Today - 09/25

* కృష్ణా జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐ లు, ఒక కానిస్టేబుల్‌ ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో పెనుగంచిప్రోలు ఎస్‌ఐ హశ్వక్‌, కలిదిండి ఎస్సై సుధాకర్‌, కానిస్టేబుల్‌ రజనీ కుమార్‌ (పిసి 2365) లు ఉన్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన లోక్‌ అదాలత్‌ లో ఒక కేసుకు సంబంధించి బాధితులను భయపెట్టి లంచం డిమాండ్‌ చేసిన కేసులో పెనుగంచిప్రోలు ఎస్‌ఐ హశ్వక్‌ ను సస్పెండ్‌ చేస్తూ ఎస్‌పి రవీంద్రనాథ్‌ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కైకలూరు టౌన్‌ లో ఇటీవల స్పెషల్‌ పార్టీ సిబ్బంది, పేకాట శిబిరం పై రైడ్‌ చేయగా, సదరు పేకాటకు కలిదిండి ఎస్‌ఐ సుధాకర్‌, కానిస్టేబుల్‌ రజిని కుమార్‌ లు పేకాట నిర్వాహకులకు సహకరించినట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో వారిని సస్పెండ్‌ చేస్తూ ఎస్‌పి రవీంద్రనాథ్‌ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

* పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రైల్వేస్టేషన్ లో గంజాయి పట్టివేత. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏజెన్సీ నుండి చెన్నై కు తరలిస్తున్న 130కిలోల గంజాయిని నిడదవోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ సుమారు 3 లక్షల 90 వేలు ఉంటుందని దీనికి తరలిస్తున్న 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కొవ్వూరు డ్శ్ఫ్ ఖ్.రాజేశ్వర రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో లారీలు,కార్లు,ట్రాన్స్ పోర్ట్ వాహనాలలో గంజాయిని ఎక్కువగా తరలించడం,ఆపై పోలీసులకు పట్టుబడటంతో స్మగ్లర్లు కొత్త మార్గాలను ఎంచుకుని, రైలు మార్గం ద్వారా తరలిద్దామని సాధారణ ప్రయాణికుల వలే వారితో కలిసిపోయి చిన్ని చిన్ని ప్యాకింగ్లు గా చేసి సూట్ కేసుల్లో గంజాయిని తరలిస్తున్న క్రమంలో నిడదవోలు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో,కాపు కాసి నిడదవోలు రైల్వే స్టేషన్లో వలపన్ని పట్టుకున్నారు. ఈ గంజాయి విశాఖ జిల్లా నర్సీపట్నం నుండి గుట్టుచప్పుడు కాకుండా రాజమండ్రి తరలించి అక్కడ నుండి రాజమండ్రికి చెందిన రమణమ్మ ఆధ్వర్యంలో తమిళనాడు తరలిస్తున్నట్లు డ్శ్ఫ్ క్.రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ గంజాయి తరలింపుకు ప్రధాన సూత్రధారి అయిన జెర్రిపోతుల రమణమ్మ తో పాటు మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు డ్శ్ఫ్ తెలిపారు.

* ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామానగరం గ్రామం వద్ద అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన సత్తుపల్లి పట్టణం కు చెందిన గీతాంజలి(ప్రైవేట్) పాఠశాల స్కూల్ బస్.విద్యార్థులను స్కూల్ కు తీసుకువస్తుండగా జరిగిన ఘటన.సురక్షితంగా బయటపడ్డ విద్యార్థులు. తప్పిన ప్రమాదం.

* చిత్తూరు జిల్లా నగర నియోజక వర్గం పుత్తూరు డిగ్రీ కళాశాలలో విశ్రాంతి ఉద్యోగి అటెండర్ ం.మున స్వామి భవనంపై నుండి దూకి మృతి. మండల పరిధిలోని చిన్న రాజు కుప్పం కు చెందిన ఏం. మునస్వామి పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటెండర్ గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు . రిటైర్ అయిన మూడు సంవత్సరాల ఆయనకు ప్రభుత్వం నుండి రావలసిన పింఛన్ గాని ఎటువంటి బెనిఫిట్స్ రాని కారణంగా ఆయన ఈరోజు డిగ్రీ కళాశాల భవనం నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు

* ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రాకి చెందిన వివేశ్‌ (23) కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపాన గల ప్రైవేటు వర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. అంబత్తూరు ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్‌టైమ్‌గా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. వివేశ్‌ చదువుతున్న వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడంతో వివేశ్‌తో ప్రొఫెసర్‌ స్నేహంగా మెలిగారు. గత 19వ తేదీ వివేశ్‌ తన చదువు పూర్తవుతున్నందున పార్టీ ఇస్తానని తెలిపి ప్రొఫెసర్‌ను పిలిచాడు. ఇందుకు ప్రొఫెసర్‌ సమ్మతించింది. రాత్రి ఏడు గంటల సమయంలో షోలింగ నల్లూర్‌లో ప్రొఫెసర్‌ ఉంటున్న మహిళా హాస్టల్‌కు వివేశ్‌ వెళ్లాడు.

* అనంతరం ఆమెను తన బైకులో ఎక్కించుకుని ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డుకు వెళ్లాడు. పూంజేరి సమీపాన గల చీకటి ప్రాంతంలో వాహనాన్ని ఆపాడు. దీంతో భీతి చెందిన ప్రొఫెసర్‌ ఎందుకు ఇక్కడ ఆపావని ప్రశ్నించగా లోపల రిసార్ట్‌ ఉందని, అక్కడ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. తర్వాత పొదలు ఉన్న చోటుకు ఆమెను తీసుకెళ్లి కత్తి చూపి, దుస్తులు విప్పమని బెదిరించాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా వీడియో చిత్రీకరించాడు. ఈ విషయం బయట చెప్పకూడదని బెదిరించి మళ్లీ ఆమెను హాస్టల్లో దింపివేశాడు. తర్వాత తనతో గడపాలని, లేకుంటే నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో సెమ్మంజేరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివేశ్‌ను అరెస్టు చేసి ప్రొఫెసర్‌ నగ్న వీడియోను డిలీట్‌ చేశారు. అతన్ని సోమవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

* గోదావరిలో పడవ ప్రమాదం విషాదానికి నేటికి 11 రోజులు అవుతోంది. విహారయాత్రకని ప్రయాణికులతో బయల్దేరిన పడవ ప్రమాదం నుంచి అతి కొద్ది మంది మాత్రమే బయటపడగలిగారు. వరంగల్ జిల్లా కడిపికొండ గ్రామానికి చెందిన ముగ్గురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు

* నెల్లూరు, అధికార పార్టీ నాయకుల వేధింపు లతో దగదర్తి మండలం యలమంచిలిపాడు కు చెందిన ఆశ కార్యకర్త ప్రమీల ఆత్మహత్యాయత్నం. నెల్లూరు లోని రామచంద్రారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమీల ను పరామర్శించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .

* ఏలూరు డిఎస్పి ని కలిసిన ట్రాన్స్జెండర్స్, ఈ నెలలో వారు నివసిస్తున్న ఇంట్లో మూడుసార్లు దొంగతనాలు జరిగాయి వారికి సంబంధించిన వస్తువులు నగదు దోచుకు పోయారు అని దానికి సంబంధించిన విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎస్ఐ స్పందించడం లేదని చాలా చిన్నచూపు చూస్తున్నారని తక్షణమే డిఎస్పీ గారు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు.

* భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణలో భాగంగా ఇద్దరు పైలట్లు మిగ్ 21ను ఇవాళ ఉదయం గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ చేశారు. కొంచెం దూరం వెళ్లగానే మిగ్ 21 కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన భోపాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.

* ఈ ఏడాది ఇప్పటి వరకు 12 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కుప్పకూలిపోయాయి. అసలు ఎయిర్‌క్రాఫ్ట్‌లు కుప్పకూలడానికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్‌లోని బికనేర్‌లో మిగ్ 21 ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలిన విషయం విదితమే. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

* తమిళనాడులోని మధురై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు 23 తుపాకులను సీజ్ చేశారు. ఆదివారం దుబాయి నుంచి స్పైస్‌జెట్ విమానంలో ముగ్గురు వ్యక్తులు మధురై ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అజ్మల్‌ఖాన్, కోలిక్ మహ్మద్, మునిజ్పూ అనే ముగ్గురు వ్యక్తుల బ్యాగులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా ఆ తుపాకులు బయటపడ్డాయి. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. తుపాకులను సీజ్ చేశారు. అయితే ఈ తుపాకులను షూటింగ్ ప్రాక్టీస్ తీసుకొచ్చామని చెబుతున్నప్పటికీ ఇండియన్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తేలింది. ఈ 23 తుపాకుల ధర రూ. 17 లక్షల విలువ ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.