Politics

నాలుగు నెలలుగా నరకం చూపిస్తున్నారు

Chandrababu Slams YS Jagans Administration

పీపీఏల అంశంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసి సీఎం జగన్‌ అభాసుపాలయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో విద్యుత్‌ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేకుండా సంస్కరణలు తీసుకొస్తే.. నేడు రూ.వేలాది కోట్ల నష్టం అంటూ తమ అసమర్థతను వైకాపా ప్రభుత్వం బయట పెట్టుకుందని ఎద్దేవా చేశారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీపీఏలపై ప్రధానికి జగన్‌ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. దీర్ఘకాలంలో పునరుత్పాదక విద్యుత్తే చవక అని కేంద్ర ఇంధనశాఖ మంత్రి కూడా సీఎంకు రాసిన లేఖలో చెప్పారని.. నిపుణులు, న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. మీడియా సమావేశం పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చే అధికారం అధికారులకు ఎవరిచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేసే తప్పులకు అధికారులు బలికావొద్దని చంద్రబాబు హితవు పలికారు. విద్యుత్‌ రంగంలో మొదట సంస్కరణలు తీసుకొచ్చింది తామేనని చెప్పారు. విద్యుత్‌ కోతల నుంచి మిగులు విద్యుత్‌ సాధించామన్నారు. నాణ్యమైన, తక్కువ ధరకు విద్యుత్‌ అందించాలని ముందుకెళ్లామని.. తమ హయాంలో విద్యుత్‌ రంగానికి 149 అవార్డులు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామనుకుంటే.. 4 నెలల్లోనే ప్రజలకు నరకం చూపిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.