Editorials

చైనాలో ముస్లింల బాధలపై మాట్లాడు

Imran Khan Asked To Speak Of Atrocities On Muslims In China

చైనాలో ఉయిఘర్స్‌ సహా టర్కీ భాష మాట్లాడే ముస్లిం మైనారిటీల నిర్బంధం గురించి ఎందుకు మాట్లాడడం లేదని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రశ్నించారు. ఈ విషయంలో ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారని దక్షిణ, మధ్య ఆసియా విభాగ ప్రతినిధి అలైస్‌ వెల్స్‌ పాక్‌ వక్రబుద్ధిని బహిర్గతం చేశారు. కశ్మీర్‌ ముస్లింలపై ఆందోళన చెందుతున్న ఇమ్రాన్‌ చైనాలోని మైనారిటీలపై కూడా గళం విప్పాలని నిలదీశారు. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా చైనా, పాక్‌ మధ్య సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఐరాసలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉయిఘర్స్‌ సమస్యపై ఇమ్రాన్‌ను ప్రశ్నించగా.. దాటవేసే ప్రయత్నం చేశారు. చైనా-పాక్‌ది ప్రత్యేక బంధం అని.. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇరు దేశాల మధ్య జరిగే ప్రైవేట్‌ సమావేశాల్లో చర్చించుకుంటామని వ్యాఖ్యానించారు. ఉయిఘర్స్‌ తెగకు చెందిన అనేక మంది ముస్లిం మైనారిటీలను చైనా ప్రత్యేక శిబిరాల్లో నిర్బంధించినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. తొలుత అలాంటి శిబిరాలేమీ లేవని కొట్టిపారేసిన చైనా..తాజాగా అవి అతివాదం వైపు ఆకర్షితులవుతున్న యువతకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలని వాదిస్తోంది.