Fashion

బాడీ పాలిషింగ్ చేయించుకుంటే మాంచి నిగారింపు

What is body polishing | TNILIVE Telugu Fashion & Beauty Tips

బ్యూటీపార్లర్‌కి వెళ్లినప్పుడు అక్కడివారు.. మీ చర్మానికి టాన్‌పట్టేసింది. బాడీ పాలిషింగ్‌ చేయించుకోవచ్చు కదా! అని అనడం తెలిసిందే. అసలింతకీ ఇది ఎందుకు చేయించుకుంటారు? ఎలా చేస్తారు? ప్రయోజనాలేంటి? ఇలా బోలెడు సందేహాలున్నాయి కదా…

చక్కగా కనిపించాలని అమ్మాయిలు చేయని ప్రయత్నమంటూ ఉండదు. అలాంటి పద్ధతుల్లో బాడీ పాలిషింగ్‌ ఒకటి. ప్రత్యేక సందర్భాల్లో ఈ చికిత్స చేయించుకోవడం వల్ల చర్మం తేమతో, తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. దీన్ని బ్యూటీపార్లర్లలోనే కాదు… చర్మ వైద్యనిపుణుల దగ్గరా చేయిచుకోవచ్ఛు

ఎలా చేస్తారు: ఇందుకు చాలా పద్ధతులే ఉన్నాయి. సాధారణంగా స్క్రబ్బింగ్‌, క్లెన్సింగ్‌, మసాజింగ్‌ విధానాల ద్వారా పాలిషింగ్‌ చేస్తారు. చివరగా గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరిచి మాయిశ్చరైజర్‌ రాస్తారు. వైద్యుల ఆధ్వర్యంలో చేయించుకున్నప్పుడు ఎక్కువ నిగారింపు రావడానికి మాండలిక్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌ వంటి పూతలూ వేస్తారు. ముఖ చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి బాడీ పాలిషింగ్‌ కేవలం శరీరానికే చేస్తారు.

ఏంటి ప్రయోజనం: దీనివల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతిమంతంగా, మృదువుగా కనిపిస్తుంది. చర్మకణాలు పునరుత్తేజమై, కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి.

ఎప్పుడు చేయించుకోవాలి: ఏదైనా వేడుక, సందర్భం ఉన్నప్పుడు కనీసం వారం ముందు దీన్ని ప్రయత్నించొచ్ఛు దీనివల్ల మీకేమైనా అలర్జీలు, లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఎదురైనా కోలుకోవడానికి సమయం ఉంటుంది. వీలైనంతవరకూ వారం విరామంతో ఒకటిరెండుసార్లు చేయించుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.

ఎవరైనా చేయించుకోవచ్చా: అలర్జీలు, ఇతర చర్మ సంబంధ సమస్యలు, జ్వరం ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండాలి.

ఇంట్లోనూ ప్రయత్నించొచ్చా: వేడి నీళ్లలో టర్కీటవల్‌ని ముంచి గట్టిగా పిండి… దాంతో ఒంటిని తుడుచుకోవాలి. ఆపై కొబ్బరి లేదా ఆలివ్‌ నూనెతో శరీరానికి మర్దన చేసుకోవాలి. తరువాత తేనె, పంచదార కలిపిన మిశ్రమాన్ని పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి బాడీలోషన్‌ రాసుకోవాలి. రోజూ సన్‌స్క్రీన్‌లోషన్‌ వాడటమూ తప్పనిసరే. అప్పుడే టాన్‌ తగ్గి చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.