తనకు లభించిన అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి అలంకారప్రాయంగా తాను భావించట్లేదని, వాస్తవానికి అది ఛాలెంజ్‌తో కూడిన పదవి అని ఆ సంస్థ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా YLP మాట్లాడుతూ తెలుగు భాష కోసం దాని వెలుగు కోసం తాను పోరాటం చేస్తానని, గ్రామాల్లోని పాఠశాలల స్థాయి నుండి దీనికి ప్రాచుర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రతి ప్రభుత్వ విభాగంలో తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేలా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. తెలుగు భాష కోసం మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఎన్.టీ.రామారావు, జగన్‌మోహనరెడ్డి తదితరులు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. మన రాష్ట్రంలో తెలుగు భాష కోసం చేసే ఏ కార్యక్రమానికైనా తన అండదండలు సంపూర్ణంగా ఉంటాయని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అభయమిచ్చారని, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో తెలుగు భాషను పరిరక్షించే కృషిని చేస్తానని YLP తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ భవనం రెండో అంతస్థు నిర్మాణానికి ₹10లక్షలు విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెస్కో ప్రచురణల సంస్థ యజమాని విజయకుమార్ అధ్యక్షత వహించారు. స్వాతి సంపాదకుడు వేమూరి బలరాం, ప్రముఖ కవి, ఐ.ఎ.ఎస్ అధికారి వాడ్రేవు చినవీరభద్రుడు, బుక్ ఫెస్టివల్ సొసైటీ నిర్వాహకులు వెంకటనారాయణ, బాబ్జీ, లక్ష్మణ్, విజయవాడ సాహితీ ప్రముఖులు వెన్నా వల్లభరావు, గుమ్మా సాంబశివరావు, సుంకర నాగభూషణం, యార్లగడ్డ శివరాం తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మీప్రసాద్ వెలగపూడిలోని సచివాలయంలో ప్రభుత్వం ఆయనకు కేటాయించిన 196వ గదిలో ప్రవేశించి కార్యాలయ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గ్రామస్థాయి నుండి తెలుగుకు వెలుగు తీసుకువస్తా-యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
Related tags :