* అమెరికాలో భారత సంతతి సిక్కు పోలీసు అధికారిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. టెక్సాస్ రాష్ట్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ ట్రాఫిక్ స్టాప్ వద్ద సందీప్ సింగ్ ధలివాల్ అనే అధికారి విధులు నిర్వహిస్తున్న సమయంలో వెనుకవైపు నుంచి ఆయనను కాల్చి చంపాడు. ఈ అధికారి వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండవచ్చు. ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పిన వివరాల ప్రకారం… విధుల్లో ఉన్న సందీప్ సింగ్ ఓ కారును ఆపాడు. అందులో ఓ పురుషుడు, మహిళ ఉన్నారు. కారును ఆపిన వెంటనే అందులో ఉన్న వ్యక్తి వెంటనే కిందకు దిగి.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు సమీపంలోని షాపింగ్ సెంటర్ వైపు పరుగెత్తాడు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని గుర్తించామని అతడితో పాటు ఉన్న మహిళను కూడా అదుపులోకి తీసుకున్నామని సదరు అధికారి తెలిపారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు. సందీప్ సింగ్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
* ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసు విచారణ ఊపందుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతి ఆయోగ్ మాజీ సీఈవో సింధుశ్రీ ఖుల్లార్ ను విచారించేందుకు సీబీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. సింధుశ్రీతో పాటు కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి అనూప్ కే పూజారి, అప్పట్లో ఆర్థిక శాఖ డైరెక్టర్ గా పని చేసిన ప్రబోధ్ సక్సేనా, ఆర్థిక వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ రవీంద్ర ప్రసాద్ లను కూడా విచారించేందుకు అనుమతించింది. ఇప్పటికే కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
* ఓ పోకిరి చేష్టలకు ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. అమ్మా అని పిలుస్తూనే అలా చేశాడనీ ఆమె జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
* కంచిలి గ్రామానికి చెందిన మాధవ్ అనే వ్యక్తి ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. గతంలో కంచిలిలో పనిచేసినప్పుడు భారతీయ స్టేట్ బ్యాంకు సమీపంలో ఓ అద్దె ఇంటిలో నివసిస్తూ వచ్చాడు. అదే ఇంటి కింది పోర్షన్లో ఏపీజీవీ బ్యాంక్ ఉండేది. అక్కడ పనిచేస్తున్న దంపతులతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉండేవాడు. వారిద్దరినీ మమ్మీడాడీ అని పిలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ మహిళ ఓసారి స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. అనంతరం దాన్ని చూపించి ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో వేధించడం మొదలుపెట్టాడు. అయినా ఆమె అతనికి చిక్కలేదు. ఈలోగా మాధవ్‌కు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యాడు. అప్పటికీ వేధింపులు మానుకోలేదు. వారం రోజుల క్రితం కంచిలి వచ్చిన మాధవ్ సదరు వివాహితను మళ్లీ బెదిరించాడు. దీంతో విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారంతా మాధవ్‌ను మందలిద్దామన్న నిర్ణయానికి వచ్చారు. ఈలోగా ఏం జరిగిందో సదరు వివాహిత గురువారం అర్థరాత్రి బలవన్మరణానికి పాల్పడింది. చనిపోతూ మాధవ్ చేష్టలను, అతనికి సహకరించిన మరో ఇద్దరి తీరును తెలియజేస్తూ సూసైడ్ నోట్ రాసింది. కుమార్తె మరణ సమాచారం అందడంతో ఒడిశాలో ఉన్న ఆమె తల్లిదండ్రులు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* జమ్ము కశ్మీర్లో శనివారం భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. గండర్బాల్ జిల్లాలోని నారనాగ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ఊరిలో మొదట కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ నిర్వహణలో భాగంగా సోదాలు నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు ధీటుగా ఎదుర్కొని వారిని అక్కడికక్కడే హతమార్చాయి. సంఘటనా స్థలం నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
* విశాఖపట్నం జిల్లాలోని ఎజెన్సీ ప్రాంతంలో ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కొందరు ప్రాణాలతో పట్టుబడినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. మావోయిస్టుల అగ్రనేత చలపతి భార్య అరుణ పోలీసులు అదుపులో ఉన్నారు. ఏజెన్సీలో జరిగిన ఎదురుకాల్పుల్లో అరుణ గాయపడ్డారు. ఈ క్రమంలో గాయాలతో ఉన్న అరుణను పోలీసులు అదుపులోకి తీసుకుని.. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చికిత్స పూర్తయిన అనంతరం అరుణను మరింత విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
* ఇదిలా ఉంటే.. రాష్ట్ర డీజీపీ గౌతమ్ నవాంగ్ ఇటీవల ఆకస్మికంగా విశాఖపట్నం పర్యటనకు వచ్చారు. బీచ్‌రోడ్డులోని పోలీస్ మెస్‌లో బస చేసిన ఆయన నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, విశాఖ డీఐజీ వీఎల్‌కే రంగారావు, జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కొద్దిరోజుల క్రితం విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చాలా అప్రమత్తంగా వుండాలని, మావోలు ఎదురుదెబ్బతీసే అవకాశం వున్నందున కూంబింగ్‌కు వెళ్లే సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు. 24/7 గస్తీ ఉండాలని ఆయన సూచించారు.
* కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త చలానాలకు జడిసి ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనల గురించి కూడా చదువుతూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి గుజరాత్లో చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా చూసి ఆత్మహత్యాయత్నం చేశాడో ఆటో డ్రైవర్. ఈ సంఘటన అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. రాజు సోలంకి అనే ఆటో డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.18 వేల చలానా విధించారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురయిన రాజు.. ఫినాయిల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దాంతో అతడిని ఆస్పత్రిలో చేర్చారు.రాజు మాట్లాడుతూ.. ‘నేను చాలా పేదవాడిని. అలాంటది ట్రాఫిక్ అధికారులు నాకు ఏకంగా రూ. 18వేలు చలానా విధించారు. ఇంత భారీ మొత్తాన్ని నేను ఎలా చెల్లించాలి. నా ఆటోను కూడా సీజ్ చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించాలి’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రాజు.
* లక్ష్మీ విలాస్ బ్యాంకుపై ఆర్బీఐ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ బ్యాంకు డైరక్టర్లు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల శాఖ ప్రస్తుతం బ్యాంకు అధికారులను విచారిస్తున్నది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిర్వహణలో బ్యాంకు అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అధిక స్థాయిలో బ్యాంకు రుణాలు ఇచ్చినట్లు తేలింది. మరో వైపు బ్యాంకు వద్ద మూలధనం తక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా లక్ష్మీ విలాస్ బ్యాంకుకు ఆర్బీఐ నోటీసులు జారీ చేసింది. బ్యాంకు పర్ఫార్మెన్స్ను పెంచాలన్న ఉద్దేశంతోనే కొన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ చెప్పింది. రోజువారీ లావాదేవీలకు ఎటువంటి విఘాతం ఉండదని పేర్కొన్నది
* తిరుపతి కొర్లగుంట ప్రశాంతినగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాప్‌కార్న్ తయారుచేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్. పేలుడులో ఐదుగురికి గాయాలు అవ్వగా… ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు.
* నెక్కంటి సూర్య వెంకట రాయుడుకు చెందిన 296 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అనుచరుల యత్నం, స్థలం లో ఉన్న ఇల్లు కూల్చేసి వాచ్ మేన్ ను కొట్టి, సెల్ ఫోన్ బద్దలు కొట్టారు. తనకు ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించాలని కోరిన బాధితుడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం టీచర్స్ కోల నీ ఉన్న స్థలం విలువ సుమారు రూ.70 లక్షలు.
* మంగళగిరి పరిధిలోని ఐరన్ చోరీ ఘటనలో 13 మంది నిందితుల అరెస్ట్. రూ.35 లక్షల విలువైన 76.2 టన్నుల ఇనుము స్వాధీనం. 2 లారీలు, 2 ప్రొక్రేన్లు సీజ్. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన నార్త్ డీఎస్పీ దుర్గాప్రసాద్, రూరల్ సీఐ శేషగిరిరావు, రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి.
* ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ నెలనెల పెన్షన్ ఇస్తున్నదని భారత్ ఆరోపించింది. యూఎన్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాన్ని భారత్ ఖండించింది. యూఎన్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక దేశం పాకిస్థాన్ అని భారత విదేశాంగ కార్యదర్శి విదిశా మైత్రా తెలిపారు. ఆల్‌ఖయిదా, దాయిశ్ సంస్థలకు నిధులు ఇవ్వకూడదని యూఎన్ ఆంక్షలు విధించినా.. పాక్ మాత్రం ఆ సంస్థ ఉగ్రవాదులను ఆదుకుంటోందని విదిశా తెలిపారు. ఇమ్రాన్ ప్రసంగానికి ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ రిప్లై ఇచ్చింది. అణుయుద్ధం వస్తుందని హెచ్చరించిన ఇమ్రాన్ వ్యాఖ్యలు ఆ దేశం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నదని, దాంట్లో ఎటువంటి రాజనీతి లేదని భారత్ ఆరోపించింది. యూఎన్ బ్యాన్ చేసిన 130 మంది ఉగ్రవాదులు పాక్‌లోనే ఉన్నారని, 25 ఉగ్ర సంస్థలు కూడా అక్కడే ఉన్నాయని, దీన్ని ఆ దేశం అంగీకరిస్తుందా అని విదిశా ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరించి చెప్పడం కాదు అని, 1971లో స్వంత ప్రజలను ఊచకోత కోసిన తీరును ఇమ్రాన్ గుర్తు చేసుకోవాలని భారత్ పేర్కొన్నది. జెంటిల్మెన్ గేమ్‌గా పిలువబడే క్రికెట్ ఆటను ఆడిన ఇమ్రాన్ ఇప్పుడు తమ దేశంలోనే ఆయుధాలు అమ్మే దారా ఆదమ్ ఖేల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉందని విదిశా నిలదీశారు. పాక్‌లో 1947లో 23 శాతం మైనార్టీలు ఉండేవారని, ఇప్పుడు అక్కడ మైనార్టీల సంఖ్య కేవలం 3 శాతం మాత్రమే ఉందన్నారు.