Politics

హుజూర్‌నగర్ తెదేపా అభ్యర్థిగా చావా కిరణ్మయి ఖరారు

Chava Kiranmayi Confirmed As Huzurnagar TDP Candidate

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు తెదేపా తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీకి చెందిన మహిళా నేత చావా కిరణ్మయిని అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆమెకు పార్టీ నేతలు బీఫారం అందజేశారు. పార్టీ గెలుపునకు కార్యకర్తలు, నేతలు సమష్టిగా కృషి చేయాలని రమణ కోరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న కిరణ్మయిని అభ్యర్థిగా నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో తెదేపాది కీలకపాత్ర అని.. తమ ప్రభుత్వ చర్యల వల్లే హైదరాబాద్‌, ఐటీ అభివృద్ధి చెందాయని ఆయన వివరించారు. తెలంగాణతో తెదేపాకు విడదీయరాని బంధం ఉందని.. ఈ ప్రాంతంలో పార్టీ పునర్‌వైభవం కోసం కృషి చేస్తామన్నారు. తన గెలుపునకు హుజూర్‌నగర్‌ ప్రజలు సహకరించాలని కిరణ్మయి కోరారు. పార్టీ అధినేత చంద్రబాబు తనపై గొప్ప బాధ్యత ఉంచారన్నారు. తెదేపాకు పూర్వవైభవం హుజూర్‌నగర్‌ నుంచే ప్రారంభం కానుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.