Devotional

దుర్గమ్మ దసరా ఆరంభం

Dasara 2019 Celebrations Started In Durga Temple

విజయవాడ ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్వనమివ్వనున్నారు. తొలిరోజైన నేడు అమ్మవారు స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 5700 మంది పోలీసులు, 1200 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 350 మంది సెక్యూరిటీ సిబ్బంది, 900 మంది వాలంటీర్లు విధుల్లో ఉన్నారు.మరోవైపు శ్రీశైలంలోనూ నేటి నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలోని వరంగల్‌ శ్రీభద్రకాళి ఆలయంలోనూ కలశస్థాపన, జ్యోతిప్రకాశనంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఇక్కడ 9 రోజుల పాటు అమ్మవారికి ఆరాధన ప్రత్యేక అలకంరణ, పూజలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం విశేష అభిషేక పూజ, ఘటస్థాపనతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం నుంచే అన్ని ఆలయాలల్లోనూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి.

భారతీయుల ప్రధాన పండుగలలో విజయ దశమి లేదా దసరా ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది.
తొలిరోజు- శైలపుత్రి

శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!, వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!..

నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.