లవంగాల టీ తాగుదామా..
రోగాలను నయం చేస్తుంది లవంగాల టీ. అధిక పోషక గుణాలున్న లవంగాలతో చేసిన టీ రుచిగా, ఘాటుగా కూడా ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.-లవంగాల టీని కొద్దిగా అరచేతులకు రాసుకుంటే చేతుల్లో దాగున్న క్రిములు చనిపోతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండే ఈ టీ చేతులను శుభ్రంచేస్తుంది. ఏదైనా తినేముందు ఈ టీని కొద్దిగా చేతులకు రాసుకుంటే మంచిది.ఆర్థరైటీస్ లేదా కీళ్లనొప్పులు, తెగిన కండరాల నొప్పి నుంచి ఉపశమనానికి కూడా లవంగాల టీ ఉపయోగపడుతుంది. లవంగాలతో తయారు చేసిన టీలో శుభ్రమైన బట్టను ముంచి నాన్చాలి. ఈ నానిన గుడ్డను నొప్పిగా ఉన్నప్రాంతంలో 20 నిమిషాలు ఉంచితే మంచిది. ఇలా రోజూ రెండు నుంచి 3 సార్లు చేయడం వల్ల ఫలితం పొందుతారు.-లవంగాలతో చేసిన టీవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనానికి ముందు ఒక కప్పు లవంగాలతో చేసిన టీ తాగడం వల్ల అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కడుపులో నొప్పి, మంట వంటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
*** యాలకులతో చక్కటి ప్రయోజనాలు
సుగంధద్రవ్యాల్లో యాలకులదే ప్రథమ స్థానం. బతుకమ్మ, దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. అమ్మకు నైవేద్యంగా తయారుచేసే తీపి పదార్థాలలో తప్పనిసరిగా యాలకులను వేస్తూంటాం. వీటిలో ఉన్న ప్రయోజనాలు తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టం. యాలకుల్లో చాలా రకాలున్నాయి. జింగీబెరాసెయ్ జాతి మొక్కల నుంచీ లభిస్తాయి యాలకులు. ఇండియాతోపాటూ భూటాన్, నేపాల్, ఇండొనేసియాలో కూడా లభిస్తాయి. సుగంధ ద్రవ్యాల్లో రాణిగా చెప్పుకున్నే యాలకులు ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో మూడోవి. కుంకుమపువ్వు, వెనీలా మాత్రమే యాలకుల కంటే ఖరీదైనవి. యాలకుల్లో ప్రధానంగా గ్రీన్, బ్లాక్ అనే రెండు రకాలుంటాయి. ఎక్కువగా వాడే గ్రీన్ యాలకులు. ఇండియా, మలేసియాలో అధికంగా పండుతాయి. యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాదు. కాన్సర్ లాంటి వ్యాధుల్ని కూడా అడ్డుకోగలవు. డిప్రెషన్ నుంచీ బయటపడాలంటే ఏ యాలకుల టీయో, పాలో తాగితే సరి.
*జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
యాలకుల్లో మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలున్నాయి. ఇవి జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తాయి. అలాగే కడుపులో మంట, నొప్పి వంటి వాటిని పోగొడతాయి. పొట్టలో విడుదలయ్యే బైల్ యాసిడ్‌ను యాలకులు క్రమబద్ధీకరిస్తాయి.
*డిప్రెషన్‌కి సరైన మందు
ప్రతి రోజూ యాలకుల టీ తాగితే. చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. కుంగుబాటు ధోరణిని పోగొడుతాయి.
*ఆస్తమాకి విరుగుడు
కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు యాలకుల్ని క్రమంతప్పకుండా వాడాలి. ఇవి రక్త ప్రసరణను తేలిక చేసి ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. కఫాన్ని కూడా తగ్గిస్తాయి. గ్రీన్ యాలకుల్ని ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల్ని నయం చేయడానికి వాడతారు.
*బీపీని తగ్గిస్తాయి
బీపీని తగ్గించేందుకు యాలకులు బాగా పనిచేస్తాయి. మనం వాడే సూప్స్, బేకింగ్ ఐటెమ్స్‌లో యాలకుల పొడి అందుకే వేస్తుంటారు. యాలకులు రక్తపోటును ఎక్కువా, తక్కువా కాకుండా చేస్తాయి.
*కాన్సర్ రాకుండా
కాన్సర్‌ను సహజ సిద్ధంగా తగ్గించే గుణాలు యాలకులకు ఉన్నాయి. కాన్సర్‌ను అడ్డుకోవడం, అది వస్తే, త్వరగా పెరగకుండా చెయ్యగలగడం, ఒక్కోసారి కాన్సర్‌ను తగ్గించే లక్షణాలు కూడా యాలకులకు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.
*టెన్షన్‌ను పోగొట్టుతుంది
యాలకుల రుచి, సువాసన మనలో టెన్షన్, హార్ట్ ఫెయిల్యూర్, ఉద్రేకతలను తగ్గిస్తాయి. అందువల్ల ఒత్తిడిలో ఉన్నవారు టీ లేదా పాలలో యాలకుల పొడి వేసుకొని తాగితే మంచిది. యాలకుల గింజలు తిన్నా మంచిదే.
*గుండెను కాపాడతాయి
యాలకుల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు గుండెకు మేలు చేస్తాయి. వీటిలోని ఫైబర్, ఇతర పోషకాలు. కొలెస్ట్రాల్ లెవెల్‌ను తగ్గిస్తాయి. గుండెకు చక్కగా రక్తం సరఫరా అయ్యేలా చేస్తాయి.
*** కురులకు పోషకాల రక్షణ
జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండేందుకు మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో చూసుకోండి.
*పెరుగుతో పెరిగేలా
జుట్టు ఒత్తుగా పెరగాలనుకుంటున్నారా… మీరు తీసుకునే ఆహారంలో పెరుగు మోతాదును పెంచి చూడండి. దీన్నుంచి మాంసకృత్తులే కాదు, ఇతర పోషకాలూ అందుతాయి. కుదుళ్లకు రక్తప్రసరణ సజావుగా అందుతుంది. ఫలితంగా శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. దీంతోపాటు గుడ్లూ తీసుకోవాలి. వీటినుంచి అందే మాంసకృత్తులు, ఇనుము, బి విటమిన్లు ముఖ్యంగా బయోటిన్ జుట్టు బలహీనం కాకుండా చేస్తాయి. *చిట్లకుండా చేసే పాలకూర:
అన్నిరకాల ఆకుకూరల్లానే పాలకూరలోనూ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూరలో ఎ, సి విటమిన్లు, ఇనుము, బీటాకెరొటిన్, ఫోలేట్, మాంసకృత్తులు ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు, పొడిబారకుండా చేసేందుకు ఈ పోషకాలు తోడ్పడతాయి. కురులు తేమగా ఉంటే… చిట్లే సమస్య చాలామటుకూ అదుపులో ఉన్నట్లే.
*జామతో తెగకుండా:
ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకం జుట్టు తెగకుండా చేస్తుంది. కప్పు జామకాయ ముక్కల నుంచి 300 మిల్లీగ్రాములకు పైగా విటమిన్ సి అందుతుంది. అవకాశం ఉన్నప్పుడల్లా ఈ పండును తినేందుకు ప్రయత్నించాలి.`
*ఇనుముతో రాలదు
మన శరీరానికి ఇనుము ఎంత తక్కువగా అందితే… జుట్టు రాలే సమస్య అంత పెరుగుతుందని చాలామంది గుర్తించరు. జుట్టు రాలుతోంటే… ముందు ఇనుములోపం ఉందేమో తెలుసుకునేందుకు దానికి సంబంధించిన పరీక్ష చేయించుకోండి. ఆ తరువాత ఇనుము అందించే ఖర్జూరాలు, ఆకుకూరలు, నట్స్, తృణధాన్యాలు, ఓట్స్ వంటివి తీసుకోవాలి. అవసరం అనుకుంటే వైద్యుల సలహాతో ఐరన్ సప్లిమెంట్లనూ ఎంచుకోవాలి.
*నిర్జీవాన్ని తగ్గించే చిలగడదుంప
పొడిబారడం వల్ల జుట్టు నిర్జీవంగా, ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. అలాంటి జుట్టును మళ్లీ మెరిపించాలనుకుంటున్నారా… చిలగడదుంపలు ఎంచుకోవడమే సరైన పరిష్కారం. వీటిల్లో బీటా కెరొటిన్ ఉంటుంది. అది శరీరంలోకి వెళ్లేసరికి విటమిన్ ఎ గా మారుతుంది. ఆ పోషకం సెబమ్‌ను విడుదల చేసి.. జుట్టు పొడిబారకుండా, జీవం కోల్పోయినట్లు కనిపించకుండా చేస్తుంది. దీంతోపాటు క్యారెట్, గుమ్మడి, తర్బూజా, నిమ్మజాతి పండ్లనూ తీసుకోవచ్ఛు.
*రక్తప్రసరణకు దాల్చినచెక్క
ఈ పొడిని అన్నిరకాల పదార్థాల్లో చాలా కొద్దిగా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది రక్తప్రసరణను పెంచుతుంది. మీరు తీసుకునే పోషకాలు, ప్రాణవాయువు జుట్టు కుదుళ్లకు సక్రమంగా అంది, ఆరోగ్యంగా పెరుగుతుంది.