NRI-NRT

సింగపూర్ లో శ్రీనివాస కల్యాణానికి సన్నాహాలు

Singapore Telugu Samajam To Conduct Srinivasa Kalyanam

సింగపూర్‌లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సమన్వయంతో అక్టోబర్ 12,13న అత్యంత వైభవంగా శ్రీనివాస కల్యాణమహోత్సవం నిర్వహించేందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కల్యాణోత్సవానికి శ్రీవారు, శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల నుండి సింగపూర్‌వాసులను కరుణించడానికి రానున్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్ధానాలకు చెందిన అర్చకులు, వేదపండితులు తిరుమల క్షేత్రం నుంచి వచ్చి సింగపూర్లో ఆ శ్రీవారి కళ్యాణోత్సవాన్ని, ఇతర కైంకర్య సేవలను తిరుమలలోలానే శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇటువంటి సేవలు సింగపూర్‌లో నివసించే అందరికీ, తిరుమల వెళ్ళలేని వారికి కూడా ఇవి అందుబాటులో ఉండేలా, అందరినీ తరింపచేయాలనే సదుద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.తిరుమల తిరుపతి దేవస్ధానాల చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, తుడా ఛైర్మన్, టీటీడి బోర్డ్ సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇతర దేవస్ధాన అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరుకానున్నారు. గేలాంగ్ ఈస్ట్ అవెన్యూ 2, శ్రీ శివన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ఓపెన్ లాన్స్ ఈ మహోత్సవానికి వేదిక కానుంది. దేదీప్యమానంగా జరగనున్న ఈ వేడుకలో భక్తజనం అందరూ పాల్గొని కనులారా తిలకించి, తరించి, తీర్ధప్రసాదాలు, తిరుపతి లడ్డుప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని సింగపూర్ తెలుగు సమాజం కోరింది.
***5న సంబవాంగ్ పార్క్‌ లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న జరగబోయే సింగపూర్ బతుకమ్మ పండుగ సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి టీసీఎస్‌ఎస్‌ సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ బతుకమ్మ పండుగకు ప్రవేశం ఉచితమని, ఉత్తమ బతుకమ్మలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్‌ఎస్‌ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.సింగపూర్‌లో ఉన్న తెలంగాణవాసులే కాకుండా తెలుగు వారందరితోపాటూ, మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీసీఎస్‌ఎస్‌ కోరింది. సంబరాలు విజయవంతంగా నిర్వహించడానికి సహయం అందిస్తున్న దాతలకు, ప్రతి ఒక్కరికి టీసీఎస్‌ఎస్‌కృతజ్ఞతలు తెలియజేశారు.