Agriculture

పల్లెల్లో కరెంట్ కష్టాలకు చెల్లుచీటి

Telangana Government Repairing Power Lines|Telugu Agricultural News

వంగిన స్తంభాలు, వేలాడుతున్న తీగలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, పట్టపగలు వెలిగే విద్యుద్దీపాలు, కర్రల సాయంతో వేలాడే తీగలు.. ఇలా గ్రామాల్లో తిష్ఠవేసిన కరంటు సమస్యలకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన 30రోజుల పల్లె ప్రణాళిక కార్యాచరణ శాశ్వత పరిష్కారం చూపిస్తున్నది. నెల రోజుల ప్రణాళిక కోసం విద్యుత్‌శాఖ అధికారులు రూ.250 కోట్లు వెచ్చించి గ్రామాల్లో పనులు చేపట్టగా, విద్యుత్ సమస్యలు తొలగిపోతున్నాయి. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.18 లక్షల కొత్త స్తంభాలు వెలిశాయి. దాదాపు 60 ఏండ్ల కిందట గ్రామాల విద్యుదీకరణలో భాగంగా వేసిన లైన్లను పటిష్ఠపర్చి, ప్రమాదరహిత విద్యుత్ పంపిణీ వ్యవస్థగా తీర్చిదిద్దారు.

పల్లె ప్రణాళిక పవర్‌వీక్‌లో భాగంగా రాష్ట్రంలో కరంటు సమస్యల పరిష్కారం కోసం విద్యుత్‌శాఖ అధికారులు రూ.250 కోట్లు వెచ్చిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా టీఎస్‌ఎస్పీడీసీఎల్, వరంగల్ కేంద్రంగా టీఎస్‌ఎన్పీడీసీఎల్ సంస్థలతో కరంటు పంపిణీ జరుగుతున్నది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో హైదరాబాద్ మహానగరంతోపాటు 14 జిల్లాల పరిధిలో 83.54 లక్షల మంది వినియోగదారులున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో గ్రేటర్ వరంగల్‌తోపాటు 17 జిల్లాల్లో 54.34 లక్షల వినియోగదారులున్నారు. మొత్తం 1.37 కోట్ల మందిలో 22.58 లక్షల వ్యవసాయ వినియోగదారులున్నారు. మొత్తం 11,153 గ్రామాలు, 15,190 అనుబంధ గ్రామాలు, తండాలకు 2,779 సబ్‌స్టేషన్లు, 11 కేవీ ఫీడర్లు 1,38,161 ద్వారా 6,55,600 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే పంపిణీ వ్యవస్థలో ప్రధానమైన 11 కేవీ, ఎల్‌టీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దశాబ్దాల తరబడి ఆధునీకరణకు నోచుకోకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా పంచాయతీలకు వీధిదీపాలు, నీటి సరఫరా కనెక్షన్ల సంఖ్య 1,28,906 ఉండగా.. చాలావరకు మీటర్లు పని చేయకపోవడం, కొన్ని గ్రామాల్లో 24 గంటలపాటు విద్యుద్దీపాలు వెలుగుతుండటం, షార్ట్ సర్క్యూట్ తదితర కారణాలతో లక్షల యూనిట్ల విద్యుత్ వృథా అవుతున్నట్టు విద్యుత్‌శాఖ ఇంజినీర్లు గుర్తించారు.

విద్యుత్ పంపిణీ వ్యవస్థలో గుర్తించిన లోపాలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ 30 రోజుల పల్లె ప్రణాళిక కార్యాచరణలో పవర్‌వీక్ అంశాన్ని చేర్చారు. ఇందుకోసం విద్యుత్‌శాఖతో పలుమార్లు సమీక్ష జరిపి పవర్‌వీక్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యుత్‌శాఖ అధికారులు పవర్‌వీక్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నారు. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వీధిదీపాల కోసం కొత్తగా 22,413 కిలోమీటర్ల నూతన లైన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా పనులు దాదాపు పూర్తిదశకు చేరాయి. టీఎస్ ఎస్పీడీసీఎల్ పరిధిలో 10,399, ఎన్పీడీసీఎల్ పరిధిలో 12,014 మేరకు కొత్త లైన్లు వేశారు. అదేవిధంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో 1,53,670, ఎన్పీడీసీఎల్ పరిధిలో 64,874 స్తంభాలను నూతనంగా వేస్తున్నారు.

32 వేల స్తంభాలు ఇప్పటికే వేయగా… మిగిలిన స్తంభాలను ఆయా ప్రాంతాలకు చేర్చారు. వంగిన, తుప్పు పట్టిన స్తంభాలు రాష్ట్రంలో 1.52,217 ఉండగా.. వాటన్నింటినీ మార్చుతున్నారు. పాడైపోయిన సపోర్టు తీగలను రెండు పంపిణీ సంస్థల పరిధిలో 1.40 లక్షలు మార్చారు. ప్రమాదాలకు నిలయంగా మారిన లూజు లైన్లు ఎస్పీడీసీఎల్‌లో 88,551, ఎన్పీడీసీఎల్ పరిధిలో 53,851 తీగలను సరిచేస్తున్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్‌లో 6,820 కిలోమీటర్ల పరిధిలో ఏరియల్ బంచ్‌డ్ కేబుల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో 5 వేల కిలోమీటర్ల కేబుల్‌ను మారుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,554 సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లకు రీఎర్తింగ్ చేస్తున్నారు. దీంతోపాటు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సమస్యలను గుర్తించిన విద్యుత్‌శాఖ అధికారులు అంచనాలను రూపొందిస్తున్నారు. యాసంగి అనంతరం వచ్చే మే లేదా జూన్ నెలలో మరోసారి పవర్‌వీక్ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యుత్‌శాఖ అధికారులు భావిస్తున్నారు.