ఫ్యాషన్ ప్రపంచంలో ఎవర్ గ్రీన్ & మొట్టమొదటి స్థానం చీరలదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజుల్లో మాత్రం పండగలు, ప్రత్యేక వేడుకలు.. వంటి సందర్భాల్లో తప్ప మిగతా సమయాల్లో చీర (Saree) కట్టుకోవడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య కాస్త తక్కువనే చెప్పుకోవాలి. తల్లి పాత చీరలు ఉపయోగించండి చిట్కాలు (Tips To Use Mom’s Old Sarees)
ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తోన్న నేపథ్యంలో చీరల్లోనూ ఎన్నో డిజైన్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో అమ్మ (Mom) కట్టుకున్న చీరలన్నీ ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉండకపోవచ్చు కదా! మరి, అలాంటి చీరలను మీరేం చేస్తున్నారు?? ఏముంది.. మనకి ఎలానూ ఉపయోగం లేదు కదాని వేరే వాళ్లకు ఇచ్చేస్తున్నాం అంటారా?? అయితే వెంటనే అలా చేయడం ఆపండి. ఎందుకంటే.. కాస్త మనసు పెట్టాలే కానీ.. అమ్మ చీరను ఈ కాలానికి తగినట్లుగా చక్కని అవుట్ ఫిట్‌గా మలుచుకోవచ్చు. అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి..
లెహెంగా కుట్టించుకోవచ్చు..
పెళ్లిళ్లు, శుభకార్యాలప్పుడు సంప్రదాయ వస్త్రధారణకే అంతా ఓటేస్తాం. అందులో భాగంగానే చీర లేదా లంగా ఓణీ కట్టుకోవడం మామూలే! అయితే ఈసారి అలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రత్యేకమైన లెహెంగా కుట్టించుకుంటే?ఎలా అంటారా?? ఏముంది.. సింపుల్.. అమ్మ పట్టుచీరతో చూడచక్కని లెహెంగా కుట్టించుకొని దానికి మ్యాచయ్యే విధంగా బ్లౌజ్, దుపట్టా తీసుకుంటే సరి! ఈ తరహా అవుట్ ఫిట్స్ నలుగురిలోనూ మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
చక్కని పొట్లి బ్యాగ్.. (A Handy Bag)
పట్టుచీర లేదా లంగా ఓణీ కట్టుకున్నప్పుడు చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటే అంతగా బాగుండకపోవచ్చు. చిన్న పొట్లి బ్యాగ్ అయితే ఆ ఆహార్యానికి చక్కగా సూటవుతుంది. మరి, అలాంటి చూడచక్కని బ్యాగ్‌ని మీరే తయారుచేయిస్తే?? చూసినవాళ్లు వావ్ అనాల్సిందే! అమ్మ పట్టుచీర లేదా వర్క్ శారీని ఉపయోగించే వీటిని కూడా ప్రత్యేకంగా కుట్టించుకోవచ్చు.
అందమైన గౌన్.. (Beautiful Gown)
చీరలను వాటిలానే ఉపయోగించాలనే నియమం ఏమీ లేదు కదా! మనకు నచ్చిన విధంగా దానిని మార్చుకోవచ్చు. కాబట్టి రోజూ వేసుకోవడానికి ఉపయోగపడేలా నార్మల్ ఫ్రాక్ తరహాలో ఒక పొడవాటి గౌన్ కుట్టించుకోండి. ఇది మనకు భిన్నమైన లుక్‌ని ఇవ్వడమే కాదు.. అందరిలోనూ ప్రత్యేకంగానూ మనల్ని నిలబెడుతుంది.
ఆకర్షణీయమైన దుపట్టా.. (Attractive Dupatta)
ఈరోజుల్లో చుడీదార్ లేదా అనార్కలీ వంటి అవుట్ ఫిట్స్ ధరించినప్పుడు డ్రస్ కంటే ముందు అందరి చూపూ పడేది దుపట్టా పైనే! అది ఎంత ప్రత్యేకంగా ఉంటే డ్రస్‌కు అంత మంచి లుక్ వచ్చినట్లు భావిస్తున్నారు నేటి అమ్మాయిలు. మీరూ అంతేనా?? అయితే అమ్మ పట్టు చీరనే ఆకర్షణీయమైన దుపట్టాగా మలుచుకుంటే?? ఐడియా బాగుంది కదూ! ఓసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. తప్పకుండా వర్కవుట్ అవుతుంది.
ప్ లేదా కోట్ గా కూడా.. (Cape Or Coat)
అమ్మ చీరలంటే కేవలం పట్టువే కావు కదా.. మిగతా ఫ్యాబ్రిక్స్‌తో తయారైన చీరలు కూడా ఉంటాయి కదా! మరి, వాటి సంగతేంటి?? అని ఆలోచిస్తున్నారా. వాటినీ మీకు అనువుగా మార్చుకోవచ్చు. చీర కలర్‌కు మ్యాచయ్యే టాప్, బాటమ్ ఎంపిక చేసుకుని దానిపై చీరతో రూపొందించిన కేప్ లేదా కోట్ వంటివి వేసుకోవచ్చు.
కుషన్ కవర్స్‌గా.. (As Cushion Covers)
ఏ విధంగానూ అమ్మ చీర కట్టుకునే పరిస్థితిలో లేదు అంటారా?? అయితే దానిని గృహాలంకరణలో భాగంగా ఉపయోగించవచ్చు. కుషన్స్, పిల్లోస్.. వంటి వాటికి కవర్స్‌గా చీరతో తయారుచేసినవి వాడచ్చు. పైగా ఇవి డిఫరెంట్ లుక్‌ని కూడా ఇస్తాయి. పైగా గది రంగుకు మ్యాచయ్యే విధంగా అదే కలర్ శారీ ఉపయోగిస్తే గది అందం మరింత పెరుగుతుంది.
అదరగొట్టే డ్రస్..
అన్నిటికంటే ఇది చాలా సులువైన పని అని చెప్పవచ్చు. దగ్గర్లోని టైలర్ వద్దకు వెళ్లి చీర ఇచ్చి మీకు నచ్చిన విధంగా మిడీ, చుడీదార్, పరికిణీ, టాప్, మ్యాక్సీ.. ఇలా ఏదైనా కుట్టించుకోవచ్చు. పైగా కొలతలు ఇచ్చి కుట్టించుకుంటారు కాబట్టి ఇవి మీకు ఫిట్‌గా ఉంటూ చక్కని లుక్ కూడా ఇస్తాయి.
చూశారుగా.. అమ్మ చీరను ఎన్ని రకాలు తిరిగి మనం ఉపయోగించుకోవచ్చో..! ఈసారి మీరు కూడా వీటిని గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తారు కదూ!