Kids

మంచి రైతు-తెలుగు చిన్నారుల కోసం కథ

A Good Farmer And King - Telugu Kids Stories & News

ఒక రాజుగారు యుద్ధం అయిపోయాకా తన సైన్యంతో తిరిగి రాజధానికి వెళ్తుంటే, తెచ్చుకున్న ఆహార పదార్ధాలు, భోజన సామగ్రి అయిపోయాయి.

మొదలే యుద్ధంలో అలిసి పోయిన సైనికులు ఆకలి తట్టుకునే పరిస్థితిలో లేరు.

రాజుగారు ఈ విషయం గ్రహించి కొంత మంది భటులను దెగ్గిర ఉన్న ఊళ్లోకి వెళ్లి, ఏదైనా పొలం లోంచి ధాన్యం, కూరలు తీసుకు రమ్మని ఆదేశించారు.

భటులకు విషయం సగం అర్ధమైంది, సగం అర్ధం కాలేదు. రాజు గారు ధాన్యం, కూరలూ బలవంతంగా తీసుకో మన్నారని భటులు అపోహ పడ్డారు. అప్పటి దాకా యుద్ధం చేసి వచ్చిన వారికి అంత కన్నా ఏమి తోచుతుంది!

ఊళ్లోకి వెళ్లి కనిపించిన మొదటి రైతుని “ఈ ఊళ్ళో అన్నిటి కన్నా మంచి పొలం యేది?” అని అడిగారు. ఆ రైతు వాళ్ళను తీసుకుని వెళ్లి ఒక మంచి పొలం చూపించాడు. పొలం పెద్దగా వుంది. వరి, కూరలు, పళ్ళ చెట్లు, కొబ్బరకాయలు, అన్నీ వున్నాయి.

వెంటనే భటులు పొలంలోని ధాన్యం పంటకోత మొదలెట్టారు. చూసి హడిలి పోయిన రైతు “ఇక్కడ వద్దు! ఇక్కడ వద్దు! నేను వేరే చోటు చూపిస్తాను!” అన్నాడు.

భటులను మరో పొలం లోకి తీసుకుని వెళ్ళాడు. ఈ పొలం అంత పెద్దగా లేదు కాని ఇందులోనూ భటుల అవసరానికి తగ్గవి అన్నీ వున్నాయి.

భటులు కావాల్సిన వన్నీ తీసుకుని, ఆ రైతుని “ఈ పొలంలోకి ఎందుకు తీసుకుని వచ్చావు?” అని అడిగారు.

రైతు, “మీకు ముందు చూపించిన పొలం నాది కాదు, వేరే వారిది. నా మూలంగా వారికి నష్టం రావడం నాకు ఇష్టం లేదు. ఈ పొలం నాది. ఇందులోంచి మీకు ఏదైనా ఇచ్చే హక్కు నాకు వుంది” అని సమాధానం చెప్పాడు.

రైతు మంచితనం భటులను ఆకట్టుకుంది. ఈ విషయం రాజుగారికి కూడా చెప్పారు.

రాజు గారు “భటులను ఆదేశించినప్పుడు కొంచం వివరంగా చెప్పాల్సింది,” అనుకున్నారు.

ఆ రైతుని పిలిపించి, అతని మంచితనాన్ని మెచ్చుకుని, నష్ట పరిహారం చెల్లించి, పైన మంచి బహుమానం కూడా ఇచ్చి సత్కరించారు.