మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండా ఊట కుంటల నిర్మాణంతో పచ్చని పల్లెగా మారింది. ఒకప్పుడు అక్కడి రైతులు ముంబయి, పుణె వంటి ప్రాంతాలకు కూలీలుగా వలస వెళ్లేవారు. గ్రామంలోని కొందరు రైతులు జొన్నలు, ఆముదాలు వంటి వర్షాధార పంటలు సాగు చేసేవారు. కరువు తాండవిస్తున్న సమయంలో పంటసాగు చేయడం వారికి గగనమైంది. అలాంటి సమయంలో లచ్చానాయక్ అనే రైతు తన పొలానికి ఎగువన ఉండే మద్దిమాను, సురాయిపల్లి గుట్టల నుంచి వాగుల్లోకి ప్రవహించే వర్షపు నీటిని పంట పొలాల్లోకి మళ్లించాలనుకున్నాడు. ఉపాధి హామీ పథకం ద్వారా ఊట కుంట కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కుంట నిర్మాణం కోసం రెండెకరాలు కేటాయించాడు. ప్రస్తుతం గుట్ట నుంచి వచ్చే నీరు ఊటకుంటను నింపుతోంది. దీని ద్వారా ఎండిపోయిన బోరుకు ప్రాణం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న బోర్లు సైతం రీఛార్జ్ అయ్యాయి. ఈయన స్ఫూర్తితో మరికొందరు ఎకరం, ఎకరన్నర స్థలంలో ఉపాధిహామీ ద్వారా తమ పొలాల్లో ఊటకుంటలను ఏర్పాటు చేసుకున్నారు. కేవలం నాలుగు కుంటల ద్వారా నలభై బోర్లు రీఛార్జీ అయ్యాయి. 200 ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి గ్రామాలకు చేరుకున్నాయి. వీరి స్ఫూర్తితో గ్రామాలు ముందుకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో కొనియాడటం విశేషం.
ఊటకుంటలతో పల్లెలు పంటలు సుభిక్షం
Related tags :