భయం లేని ఆటతీరుతో యూఎస్ ఓపెన్‌లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను ఆకట్టుకున్నాడు భారత యువ కెరటం సుమిత్ నగాల్. ఆదివారం రాత్రి బ్యూనస్ ఎయిర్స్ ఛాలెంజర్స్ ట్రోఫీ గెలిచి కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు 135 సాధించాడు. తానెంత బాగా ఆడుతున్నప్పటికీ అవసరమైనప్పుడు అందరూ తనకు మొండిచేయి చూపిస్తున్నారని నగాల్ బాధపడుతున్నాడు. డబ్బులు లేక విదేశీ టోర్నీలకు తనతో పాటు కోచ్, ఫిజియోను తీసుకెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘ఒంటరిగా ఉంటున్నాను. ఎవరూ సాయం చేయడం లేదు. నేనెంతో అద్భుతంగా టెన్నిస్ ఆడుతున్నాను. ఇదంతా సులభంగా ఏమీ జరగడం లేదు. నేనెంతో విచారంగా ఉన్నాను. యూఎస్ ఓపెన్‌లో రాణించినప్పటికీ ఒంటరిగానే ఉన్నాను. 22 ఏళ్ల వయసులో యూఎస్ ఓపెన్‌కు అర్హత సాధించి ఒక సెట్లో ఫెదరర్‌ను ఓడించాను. ఎక్కడా దీని ప్రభావం కనిపించడం లేదు. టెన్నిస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’ అని నగాల్ వాపోయాడు. టాప్స్ పథకం కింద నెలకు రూ.50,000 సహాయంగా అందినప్పటికీ కొన్నాళ్లుగా దానిని నిలిపివేశారు. ఒలింపిక్స్ రేసులో ఉన్న ఆటగాళ్లకే దీన్ని వర్తింపచేస్తున్నారు. ‘సుమిత్ అద్భుతమైన ప్రతిభావంతుడు. ఆర్నెల్లుగా అతడి ప్రదర్శన చూస్తున్నాం. మున్ముందు జరగబోయే ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని అతడి ఎదుగుదలకు ప్రోత్సాహం ఇవ్వకపోతే అది వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. మళ్లీ భారత్ విజేతలను ఎందుకు ఉత్పత్తి చేయడం లేదని ఎవరికీ ప్రశ్నించే హక్కులేదు. నగాల్‌కు కోహ్లీ ఫౌండేషన్ సాయం చేస్తున్నప్పటికీ కోచ్, ఫిట్‌నెస్, ఫిజియో, ఇతర అవసరాలకు అవి సరిపోవు. కేవలం అథ్లెట్లు మాత్రమే మరొకరి ప్రతిభను అర్థం చేసుకోగలరు. అందుకే గోపీచంద్, మాలవ్ లాంటి వారి ద్వారా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాను’ అని మహేశ్ భూపతి అన్నాడు. నగాల్‌కు అతడు మార్గనిర్దేశం చేస్తున్నాడు. ‘ఇప్పటికీ నేను ఇరుక్కుపోయాను. నాతో నా కోచ్‌ను పర్యటనలకు తీసుకెళ్లేందుకు నేనో దారి కనుక్కోవాలి. ఎక్కువ పర్యటనలకు ఒంటరిగానే వెళ్తున్నాను. సాయం అందిస్తామని చెప్తూ అవసరమైనప్పుడు అడిగితే ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం నా అభ్యర్థనకు బదులివ్వడం లేదు’ అని సుమిత్ అన్నాడు.
భారత టెన్నిస్ దౌర్భాగ్యం
Related tags :