నటులన్నాక ఎలాంటి పాత్రలకైనా సిద్ధంగా ఉండాల్సిందే. పాత్రల పరంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనా స్వీకరించే నాయికలు దక్షిణాదిలో చాలామందే కనిపిస్తారు. అందులో కీర్తిసురేష్ ఒకరు. అటు అందం, ఇటు నటన విషయంలోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. ఇటీవల జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సొంతం చేసుకుంది. మీలో మీకు నచ్చే ఒక ప్రధానబలం గురించి చెప్పమని అడిగితే… ‘ఒకటి చెప్పడం కష్టం’ అంటూనే ఇలా మనసు విప్పింది. ‘‘కథ నచ్చిందంటే ఎంత క్లిష్టమైన పాత్రైనా సరే.. ముందు రంగంలోకి దిగేద్దాం అనిపిస్తుంటుంది. అలా కొత్త పాత్రల్లోనే కాదు, కొత్త వాతావరణంలోనూ సులభంగా ఒదిగిపోతా. అదే నా ప్రధానబలం. కొత్త ప్రదేశమో లేదంటే కొత్త పరిశ్రమకో వెళ్లినప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అలాంటప్పుడు ఎన్నో సందేహాలు ఉత్పన్నం అవుతుంటాయి. కానీ నేను మాత్రం ముందు నా చుట్టూ వాతావరణాన్ని నాకు అనుగుణంగా మలచుకొనే ప్రయత్నం చేస్తుంటా. అలా ఒకొక్కటి అన్నీ నా దారిలోకి వచ్చేస్తుంటాయి. అలాంటి దృక్పథం ఉన్నప్పుడే మన పని మనం సులభంగా చేసుకోగలుగుతాం’’ అని చెప్పింది కీర్తి.
ఒకటి చెప్పడం కష్టం
Related tags :